– ఫలితాలు విడుదల చేసిన బాలకిష్టారెడ్డి, ఎం కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం ఈనెల ఆరోతేదీన నిర్వహించిన లాసెట్ రాతపరీక్ష ఫలితాలను బుధవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ కుమార్ మొలుగారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ ఇటిక్యాల పురుషోత్తం,కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, లాసెట్ కన్వీనర్ బి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈనెల ఆరోతేదీన నిర్వహించిన లాసెట్‌కు 57,715 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తే 45,609 మంది హాజరయ్యారు.
వారిలో 30,311 (66.46 శాతం) మంది అభ్యర్థుల ఉత్తీర్ణత సాధించారు. 39,198 మంది అబ్బాయిలు దరఖాస్తు చేయగా, 30,715 మంది పరీక్ష రాశారు. వారిలో 21,002 (68.38 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 18,513 మంది అమ్మాయిలు దరఖాస్తు చేస్తే 14,891 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 9,306 (62.49 శాతం) మంది అర్హత సాధించారు. ట్రాన్స్‌జెండర్లు నలుగురు దరఖాస్తు చేస్తే ముగ్గురు పరీక్ష రాయగా, అందరూ అర్హత పొందారు. ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి, కుమార్ మాట్లాడుతూ గత విద్యాసంవత్సరంలో 31 లా కాలేజీల్లో 8,680 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అందులో కన్వీనర్ కోటాలో 7,148 సీట్లు, 1,532 సీట్లు యాజమాన్య కోటాలో ఉన్నాయని చెప్పారు. గత విద్యాసంవత్సరంలో 7,125 మంది ప్రవేశాలు పొందారని వివరించారు.
