Saturday, November 22, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురాష్ట్ర డీజీపీ ఎదుట 37మంది మావోయిస్టుల లొంగుబాటు

రాష్ట్ర డీజీపీ ఎదుట 37మంది మావోయిస్టుల లొంగుబాటు

- Advertisement -

ఆయుధాలతో సహా ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు సరెండర్‌
మిగతావారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలి
గణపతి, దేవోజీల లొంగుబాటుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం : డీజీపీ శివధర్‌రెడ్డి

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు శనివారం లొంగిపోయారు. ఇందులో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉండగా.. మిగతా 34 మంది వివిధ క్యాడర్‌కు చెందినవారున్నారు. ఇందులో పెద్ద సంఖ్యలోనే మహిళలు ఉన్నారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో లొంగిపోయి న మావోయిస్టులను పోలీసు అధికారులు హాజరుపర్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. మావోయి స్టుల సిద్ధాంతానికి మనుగడ లేదనీ, మారుతున్న కాలానికి అనుగుణంగా వారిలో మార్పు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ఇచ్చిన పిలుపుమేరకే 37 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారని చెప్పారు. ప్రస్తుతం లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులున్నారనీ, వారిలో కొయ్యడ సాంబయ్య ఎలియాస్‌ ఆజాద్‌, అప్పాసీ నారాయణ ఎలియాస్‌ రమేశ్‌, నూపో గంగ ఎలియాస్‌ నీలేశ్‌లు ఉన్నారనీ, మిగతావారిలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన వివిధ కమిటీ సభ్యులు ఉన్నారని ఆయన వివరించారు. వీరి వద్ద ఒక ఏకే-47, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు, నాలుగు పాయింట్‌ 303 రైఫిల్స్‌తో కలిపి మొత్తం ఎనిమిది ఆయుధాలున్నాయని తెలిపారు.

32 ఏండ్లుగా అజ్ఞాతంలోనే..!
సాంబయ్య ములుగు జిల్లాకు చెందినవారు కాగా అప్పాసీ నారాయణ పెద్దపల్లి జిల్లా రామగుండం కు చెందినవాడని చెప్పారు. దాదాపు 32 ఏండ్లుగా వీరు అజ్ఞాత ఉద్యమంలో ఉన్నారని అన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు ముగ్గురు ఒక్కొక్కరిపై రూ.20 లక్షల రివార్డు ఉన్నదనీ, మిగతావారికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో పేర్కొన్న రివార్డులు ఉన్నాయని తెలిపారు. వీరికి ఈ రివార్డులను వెంటనే అందజేయటం జరుగుతున్నదని ఆయన చెప్పారు.

హిడ్మా లొంగుబాటు ఆరోపణల్లో నిజం లేదు
మావోయిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి ఎలియాస్‌ ముప్పాల లక్ష్మణ్‌రావు, మరో అగ్రనాయకుడు తిప్పిరి తిరుపతి ఎలియాస్‌ దేవోజీల లొంగుబాటుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీలో రాష్ట్రానికి చెందిన ఐదుగురు గణపతి, దేవోజీ, రాజిరెడ్డి, నరహరి, హనుమంతులు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారనీ, మరో పది మంది రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిపి మొత్తం 59 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు ఉన్నారని డీజీపీ వివరించారు. తెలంగాణలో లొంగిపోవడానికి హిడ్మా ప్రయత్నించగా.. ఆయనకు అవకాశం ఇవ్వలేదని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన మరో ప్రశ్నకు జవాబిచ్చారు.

దేవోజీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా గుర్తించటం లేదు
ప్రస్తుతం లొంగిపోయినవారిలో అనారోగ్య సమస్యలు, సిద్ధాంత విభేదాలతో పాటు, పోలీసు బలగాల ఒత్తిడి కారణంగా బయటకు వచ్చారని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. లొంగిపోయిన మహిళా మావోయిస్టులకు వారి భవిష్యత్తులో నిలదొక్కుకోవడానికి అవసరమైన విద్యను అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గత 11 నెలల్లో 463 మంది మావోయిస్టులు లొంగిపోయారనీ, అందులో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు పలువురు ఇతర క్యాడర్‌కు చెందిన సభ్యులు ఉన్నారని చెప్పారు. దేవోజీని మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తాము గుర్తించటం లేదనీ, ఆ విధమైన సమాచారమూ తమ వద్ద లేదనీ, ప్రస్తుతం లొంగిపోయినవారు కూడా ఆయనను గుర్తించటం లేదని మరో ప్రశ్నకు డీజీపీ జవాబిచ్చారు.

లొంగిపోవటమే మార్గం
మారుతున్న కాల పరిస్థితుల్లో ఇంకా అజ్ఞాతంంలో ఉన్న మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోయి నూతన జీవితాన్ని ప్రారంభించటం మినహా మరో గత్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. లొంగిపోయినవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని వివరించారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న నగదు రివార్డుతో పాటు మిగతావారికి రూ.25వేల పారితోషకాన్ని డీజీపీ అందజేశారు. ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు తమ వద్దకు ఐదారు రోజుల ముందే వచ్చారని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ఐబీ ఐజీ సుమతి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ విజరు తదితరులు పాల్గొన్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా లొంగిపోయాం : సాంబయ్య, నీలేశ్‌
ప్రస్తుతం దేశంలో వస్తున్న కాలానుగుణ మార్పులను బట్టి తాము లొంగిపోయినట్టు మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు సాంబయ్య, నీలేశ్‌లు అన్నారు. తాము పార్టీకి చెప్పి లొంగుబాటులో నడిచామని తెలిపారు. ఉద్యమంలో అనేక కష్ట, నష్టాలను ఎదుర్కొన్నామనీ, కానీ అనుకున్న మార్పులేవీ కనిపించకపోవటంతో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవటమే మేలు అని భావించామని వారు చెప్పారు. సిద్ధాంతపరంగా విభేదాలేవీ లేకపోయినప్పటికీ ఆయుధాలతో పోరాటం చేయటం సాధ్యంకాని పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నదనీ, అజ్ఞాతంలో ఉన్న మిగతావారు కూడా లొంగిపోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -