శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో రూ.3,849.10 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 39 సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నిర్వహించిన కార్యక్రమంలో నగరంలో ఇప్పటికే పూర్తయిన పలు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రూ. 1878.55 కోట్లతో ప్యాకేజీ-1లో 16 ఎస్టీపీలు, రూ.1,906.44 కోట్లతో ప్యాకేజీ-2లో 22 ఎస్టీపీలు, రూ.64.11 కోట్లతో పీపీపీ మోడల్‌లో ఒక ఎస్టీపీ ఉన్నాయి. రూ. 539.23 కోట్లతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించారు. వాటిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. వాటి వివరాలిలా ఉన్నాయి.
రూ.319.43 కోట్లతో నిర్మించిన అంబర్‌పేట్, ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని 212.50 ఎంఎల్‌డీ సామర్థ్యం గల అంబర్‌పేట్ ఎస్టీపీ, రూ.109.24 కోట్లతో నిర్మించిన రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని 64 ఎంఎల్ డీసామర్థ్యం గల అత్తాపూర్ ఎస్టీపీ ఇందులో ఉన్నాయి. రూ. 44.46 కోట్లతో నిర్మించిన కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని 25 ఎంఎల్ డీ సామర్థ్యం గల ముల్లకతువా ఎస్టీపీ, రూ.34.13 కోట్లతో నిర్మించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 14 ఎంఎల్‌డీ సామర్థ్యం గల శివాలయ నగర్ ఎస్టీపీలు అందుబాటులోకి వచ్చాయి. రూ.13 కోట్లతో నిర్మించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 10 ఎంఎల్‌డీ సామర్థ్యం గల వెన్నలగడ్డ ఎస్టీపీ, రూ.18.97 కోట్లతో నిర్మించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 07 ఎంఎల్‌డీ సామర్థ్యం గల పాలపిట్ట ఎస్టీపీలు సేవలందించనున్నాయి.