Tuesday, July 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం42 శాతం బీసీ రిజర్వేషన్లలోన్యాయచిక్కులను దాచి మాపై విమర్శలా

42 శాతం బీసీ రిజర్వేషన్లలోన్యాయచిక్కులను దాచి మాపై విమర్శలా

- Advertisement -

– క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కచ్చితంగా చర్యలు
– పాత, కొత్త తేడాలు కొందరి సృష్టే : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలులో న్యాయపర చిక్కులను దాచి తమపై కాంగ్రెస్‌ నేతలు విషప్రచారం చేయడం తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు తమ ఎమ్మెల్యేలు మద్దతిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే, మతపర రిజర్వేషన్లను జొప్పించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. సోమవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాతా, కొత్త అనే తేడా తమ పార్టీలో లేదనీ, కొంత మంది కావాలనే బేదాభిప్రాయాలను సృష్టిస్తున్నారని చెప్పారు. పార్టీలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. నాయకులకు సంబంధించిన సమస్యలుంటే జాతీయ నాయకత్వం వాటిని పరిష్కరిస్తుందని తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి 46 సార్లు వెళ్లినా రాహుల్‌గాంధీ, ఇతర కాంగ్రెస్‌ నేతల అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం దారుణమనీ, ఇది తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించడమేనని అన్నారు. అభివృద్ధి విషయంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని గుర్తుచేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేయడాన్ని తప్పుబట్టారు. ఆర్డినెన్స్‌ రాకముందే, అందులో 10శాతం ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కుట్ర చేయడం బాధాకరమన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుపై రేవంత్‌రెడ్డి సర్కారు న్యాయ సలహాలు తీసుకున్నదా? తొమ్మిదో షెడ్యూల్‌ చేర్చే ప్రక్రియ గురించి తెలుసా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల విషయాల్లో సుప్రీం, హైకోర్టులు ఇచ్చిన పలు తీర్పులను ప్రస్తావించారు. తమిళనాడులో జయలలిత రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చినా..ఆ కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లోనే ఉందని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్‌ శాతం పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 285 లో సవరణ చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలను దృష్టి మళ్లించేందుకు బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం నాటకం ఆడుతున్నదని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -