రిజర్వేషన్ బిల్లు దేశానికే ఆదర్శం
ఉద్యోగ జేఏసీ నేతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం అసెంబ్లీ ఆమోదించిన బిల్లు దేశానికే ఆదర్శమని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చెప్పారు. మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వాములు అయ్యేందుకు ఉద్యోగులు సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ కులగణన ఆధారంగా రూపొందించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి ప్రభుత్వం పంపించిందని అన్నారు. ఇలాంటి ప్రజాస్వామిక బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర జనాభాలో 56.33 శాతం ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ అవకాశాలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించడం సహజ న్యాయమని వివరించారు. అవకాశాలను సమానంగా కల్పిస్తే అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకూ అందుతాయని చెప్పారు. ఇలాంటి సామాజిక న్యాయం ద్వారా సమాజంలో శాంతి సామరస్యం ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం అభినందించి రాష్ట్రపతి ఆమోదం కోసం కృషి చేయాలని సూచించారు. సామాజిక న్యాయ సాధనలో గొప్ప ముందడుగుగా నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఉద్యోగ జేఏసీ నేతలు ఎ సత్యనారాయణ, నర్సింహారెడ్డి, నజీర్, యాదగిరి, శ్రీకాంత్, రాజీవ్‌రెడ్డి, ఎండీ ఖాజా తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు 42 శాతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES