Wednesday, July 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం44 మంది సీనియర్‌ ప్రొఫెసర్లకు అడిషనల్‌ డీఎంఈలుగా పదోన్నతి

44 మంది సీనియర్‌ ప్రొఫెసర్లకు అడిషనల్‌ డీఎంఈలుగా పదోన్నతి

- Advertisement -

– ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో వివిధ మెడికల్‌ కాలేజీలకు పాలనాధికారులు అందుబాటులోకి వచ్చారు. అన్ని కాలేజీలు, టీచింగ్‌ హాస్పిటళ్లకు ప్రిన్సిపాల్స్‌, సూపరింటెండెంట్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు 44 మంది సీనియర్‌ ప్రొఫెసర్లకు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అడిషనల్‌ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారందరికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌గా, టీచింగ్‌ హాస్పిటళ్లకు సూపరింటెండెంట్లుగా నియమించింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, టీచింగ్‌ హాస్పిటళ్లకు రెగ్యులర్‌ పద్ధతిలో పరిపాలనాధికారుల నియామకం జరిగింది. అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పని చేస్తున్న 278 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ చివరి దశకు వచ్చింది. ఏడీఎంఈల పోస్టింగ్‌ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ప్రొఫెసర్లుగా ప్రమోట్‌ అయిన వారికి కూడా ప్రభుత్వం త్వరలో పోస్టింగ్స్‌ ఇవ్వనున్నది. ఈ ప్రమోషన్లతో అన్ని కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత, డిపార్ట్‌మెంట్‌ హెచ్‌వోడీల సమస్య తీరనున్నది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా పని చేస్తున్న సుమారు 231 మందిని అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు వైద్యారోగ్యశాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌, అడిషనల్‌ డీఎంఈ వంటి పోస్టులను నేరుగా రిక్రూట్‌ చేసుకునే అవకాశం లేకపోవడంతో, ప్రమోషన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నది. 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇటీవలే నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇవిగాక సుమారు మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ పోస్టులను సైతం త్వరలోనే భర్తీ చేయనున్నారు.

ధన్యవాదాలు :టీటీజీడీఏ
అదనపు డీఎంఈ పదోన్నతులను పారదర్శకంగా, వేగంగా నిర్వహించినందుకు ప్రభుత్వానికి తెలంగాణ టీచింగ్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీటీజీడీఏ) ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు మంగళవారం అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ కిరణ్‌ బొల్లేపాక, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కిరణ్‌ మాదాల, ఉపాధ్యక్షులు డాక్టర్‌ కిరణ్‌ ప్రకాశ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డికి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు, కార్యదర్శి క్రిస్టీనా చొంగ్తూకు, వైద్యవిద్య డైరెక్టర్‌ డాక్టర్‌ నరేందర్‌ కుమార్‌కు, అదనపు డీఎంఈ డాక్టర్‌ వాణికి కృతజ్ఞతలు తెలిపారు.

కతజ్ఞతలు :టీజీడీఏ
పదోన్నతులు కల్పించినందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు, కార్యదర్శి క్రీస్టీనా చొంగ్తూకు, డీఎంఈ డాక్టర్‌ నరేందర్‌ కుమార్‌ కు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ) కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు డాక్టర్‌ నరహరి, సెక్రెటరీ జనరల్‌ డాక్టర్‌ లాలు ప్రసాద్‌ రాథోడ్‌, కోశాధికారి డాక్టర్‌ ఎం.కె.రవూఫ్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రిన్సిపాల్స్‌గా, సూపరింటెండెంట్లుగా నూతనంగా పదోన్నతి పొందిన 44 మందికి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ వేరొక ప్రకటనలో ప్రభుత్వాని, ఉన్నతాధికారులను ధన్యవాదాలు తెలిపింది. నూతనంగా పదోన్నతి పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -