సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి
ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క ప్రయాణికుడు
సౌదీకి మంత్రి అజహరుద్దీన్ నేతృత్వంలో బృందం
ప్రధాని మోడీ, సీఎం రేవంత్‌రెడ్డి తదితరుల దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా
మక్కాలో అల్లాను దర్శించుకుని.. మరికొన్ని రోజుల్లో ఉమ్రా యాత్ర పూర్తవుతుందని సహచరులతో చెప్పుకుని గాఢనిద్రలోకి జారుకున్నారు. కొద్దిసేపట్లో మదీనా చేరుకునేలోపు.. రెప్పపాటులో ప్రయాణికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యేలోపు ట్యాంకర్‌లోని ఆయిల్ బస్సుపై చిమ్మేసింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద ఘటన నుంచి బయటపడటానికి డోర్లు తెరవటానికి ప్రయాణికులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మమ్మల్ని కాపాడండి..అంటూ వారు చేసిన అరుపులు అరణ్యరోదనలా మిగిలాయి. ఎగిసిపడిన ఆ మంటల్లో తెలంగాణకు చెందిన 45 మంది సజీవ దహనమయ్యారు. ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు.
మదీనా : సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరగటంతో.. తెలంగాణకు చెందిన 45 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఉమ్రా యాత్ర కోసం ఎన్నో ఆశలతో శంషాబాద్ నుంచి వీడ్కోలు పలికిన తమ బంధువులను మృత్యువు వెంటాడిందన్న వార్త సౌదీలో ఉన్న బంధువులతో పాటు హైదరాబాద్‌లో ఉన్న వారిని విషాదంలోకి నింపింది.
అసలేం జరిగింది..?
మక్కా నుంచి యాత్రికులు మదీనాకు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. మదీనా నుంచి సరిగ్గా 25 కి.మీ దూరంలో బస్సు ఆయిల్ ట్యాంకర్‌ను ఢకొీట్టింది. దీనితో కొన్ని నిమిషాల్లోనే పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.
జిద్దాకు బయలుదేరి..
నవంబర్ 9న హైదరాబాద్ నుంచి వెళ్లి.. 23న టూర్ ముగించుకుని తిరిగి వచ్చేలా ప్లాన్ చేశారు. ఉమ్రాకు వెళ్లాలంటే.. ముందుగా జిద్దాకు ట్రావెల్ ఏజెంట్లు తీసుకెళ్తారు. ఆదివారం రాత్రి 54 మంది యాత్రికులు వెళ్లారు. వారిలో నలుగురు కారులో మదీనాకు విడివిడిగా ప్రయాణించారు. మరో నలుగురు మక్కాలో ఉన్నారు. 46 మంది బస్సులో వెళ్తుండగా.. ఈ ఘోరప్రమాదం సంభవించింది.
భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్‌ను యాత్రికుల బస్సు ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగినపుడు ఎక్కువ మంది గాఢనిద్రలో ఉన్నారు. తేరుకునేలోపే కాలి బూడిదయ్యారు. సమాచారం అందిన వెంటనే సౌదీ అధికారులు, రక్షణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి ఎండీ అబ్దుల్ షోయబ్ సౌదీ ఆస్పత్రి ఐసీయూలో ఉన్నారు.
మృతులంతా హైదరాబాద్ వాసులే : హజ్ కమిటీ
సౌదీ ప్రమాదంలో 45 మంది మృతి చెందారని, వారంతా హైదరాబాద్‌కు చెందిన వారేనని హజ్ కమిటీ పేర్కొంది. ప్రమాదంలో 18 మంది మహిళలు, 17 మంది పురుషులు, 10 మంది చిన్నారులు మృతి చెందినట్టు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా పర్యాటకులంతా జిద్దాకు వెళ్లారని పేర్కొంది.
ప్రధాని దిగ్భ్రాంతి
సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధాని మోడి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సౌదీ అరేబియా అధికారులతో భారత సిబ్బంది నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. రియాద్, జిద్దాలోని భారత రాయబార కార్యాలయాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
స్పందించిన విదేశాంగ మంత్రి
ఈ ప్రమాదంపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. ప్రభావిత కుటుంబాలకు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జిద్దాలోని కాన్సులేట్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
నిర్లక్ష్యమే కారణమా..?
ఈ ప్రమాదం డ్రైవర్ అశ్రద్ధ వల్ల జరిగిందా ? రోడ్డు పరిస్థితులు కారణమా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన బస్సు పూర్తిగా దగ్ధమైందని, బాధితులను గుర్తించడం చాలా సవాలు గా మారిందని అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఎలాంటి అధికార ప్రకటనా వెలువడ లేదు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదం ఉమ్రా యాత్రలో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
సౌదీలో రోడ్డు భద్రతపై చర్యలేవి?
సౌదీ అరేబియా లో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘సౌదీ అరేబియాకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు వస్తుంటారు. కానీ రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. 2023లో కూడా ఇలా జరిగిన ఒక ప్రమాదంలో 20 మంది యాత్రికులు మర ణించారు. రోడ్డు భద్రతా మార్గదర్శకాలు జారీ చేస్తూ, ట్రావెల్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాగా ఈ దుర్ఘటన యాత్రికుల భద్రతను మరింత పెంచాలి’ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నసీరుద్దీన్ ఇంటికి టీపీసీసీ చీఫ్
విద్యానగర్‌లోని నసీరుద్దీన్ ఇంటికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ వెళ్లి వారి బంధువులను ఓదార్చారు. ఒకే కుటుంబంలో 18 మంది మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ నసీరుద్దీన్ కూడా మతుల బంధువులను పరామర్శించారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అసదుద్దీన్
సౌదీ రోడ్డు ప్రమాద ఘటనపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాద్‌లో భారత ఎంబసీతో మాట్లాడినట్టు ఆయన తెలిపారు. ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు సేకరించాలని వారిని కోరినట్టు చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన రెండు ట్రావెల్ ఏజెన్సీలతోనూ కాంటాక్ట్ అయినట్టు తెలిపారు.
మంత్రి అజహరుద్దీన్ సారథ్యంలో సౌదీకి..
సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. మంత్రి అజహరుద్దీన్ సారథ్యంలో ప్రభుత్వ ప్రతినిధి బృందం సౌదీ వెళ్లనుంది. ఈ బృందంలో ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన అధికారి ఉండనున్నారు. మృతదేహాలకు సౌదీలోనే అంత్యక్రియలు చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబానికి ఇద్దరిని చొప్పున తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
విషాద ఘటన తెలిశాక..
జిద్దాలోని భారత కాన్సులేట్ జనరల్ 24*7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. కుటుంబాలు టోల్ ఫ్రీ నెంబర్లు 8002440003, 00966122614093, 00966126614276, 00966556122301 ద్వారా, వాట్సాప్ ద్వారా సహాయం కోరవచ్చని ప్రకటించింది. కాన్సులేట్ సిబ్బంది , భారతీయ కమ్యూనిటీ వాలంటీర్లు ఆస్పత్రులు , ప్రమాద ప్రదేశాలలో సహాయాన్ని అందించడానికి, అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన 18 మంది..
చనిపోయిన వారిలో విద్యానగర్ నల్లకుంటకు చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి నసీరుద్దీన్(65) కుటుంబంలోని 18 మంది చనిపోయారు. వీరిలో నసీరుద్దీన్, ఆయన భార్య ముగ్గురు కుమార్తెలు, కుమారులు, కోడళ్లు వారి పిల్లలు అంతా కలిపి 18 మంది మరణించారు. వీరిలో 10మంది పిల్లలు ఉన్నారు.



