– మరిన్ని ఉగ్రదాడులకు అవకాశం
– ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక
శ్రీనగర్ : పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముష్కరులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కాశ్మీర్‌లో మరిన్ని ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పహల్గాం దాడి అనంతరం కాశ్మీరీ లోయలో స్లీపర్‌సెల్స్ యాక్టివేట్ అయినట్టు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూకాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాదుల ఇండ్లను సైన్యం పేల్చేస్తుండడంతో దానికి ప్రతీకారంగా వారు పెద్దఎత్తున దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తమకు సమాచారం అందిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. స్థానిక ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వాలని సూచించాయి. దీంతో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 టూరిస్టు కేంద్రాల్లో 48 కేంద్రాలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాశ్మీర్‌లోని ప్రధాన ప్రదేశాలు గుల్మార్గ్, సోనామార్గ్ దాల్ లేక్ ప్రాంతాలతో సహా పలు సున్నితమైన పర్యాటక ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించాయి.
ఉగ్రదాడి సీన్
రీక్రియేట్ చేస్తున్న ఎన్‌ఐఏ
పహల్గాం ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు, అందిన సమాచారం ఆధారంగా.. ఉగ్రవాదులను గుర్తించడానికి విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఉగ్రదాడి ప్రదేశంలో సీన్ రీక్రియేట్ చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఆ సమయంలో ఉన్న పర్యాటకులు, స్థానిక ప్రజలను ప్రశ్నిస్తున్నారు. అక్కడ వారు తీసుకున్న ఫొటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
కాశ్మీర్‌లో48 టూరిస్టు కేంద్రాల మూసివేత
- Advertisement -