– కామారెడ్డి జిల్లాలో ప్రథమ స్థానం
– కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేత
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా, బీబీపేట మండలంలోని తిమ్మయ్యగారి సుశీల నారాయణరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (టీఎస్ ఎన్ఆర్, జెడ్ పి హెచ్ ఎస్ ) అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ 2025’ (Swachh evam Harith Vidyalaya 2025) రేటింగ్‌లలో ఈ పాఠశాల అత్యుత్తమ ప్రమాణాలను ప్రదర్శించి, 5 – స్టార్ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా, ఈ రేటింగ్‌లో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలిచి విజయకేతనం ఎగురవేసింది. ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని, శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగవాన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మూల రవీంద్రారెడ్డి కి ప్రశంసాపత్రాన్ని అందించి ప్రత్యేకంగా అభినందించారు.
పాఠశాల ఆవరణలో పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపుదల, పర్యావరణ పరిరక్షణ పట్ల పాటిస్తున్న అత్యుత్తమ ప్రమాణాలకు ఈ అవార్డు నిదర్శనం. ముఖ్యంగా సురక్షిత తాగునీరు, మెరుగైన పారిశుధ్యం, హరిత వాతావరణం, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ వంటి కీలక అంశాలలో పాఠశాల కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు గాను ఈ 5 – స్టార్ రేటింగ్ దక్కింది.
ప్రశంసాపత్రం అందుకున్న అనంతరం ప్రధానోపాధ్యాయులు మూల రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ ఘనత సాధించడం మా పాఠశాలకు ఎంతో గర్వకారణం అని, ఇది మా ఉపాధ్యాయ బృందం అంకితభావం, విద్యార్థుల క్రమశిక్షణ, ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ అందించిన క్రియాశీలక సహకారంతోనే సాధ్యమైందన్నారు. ముఖ్యంగా మా పాఠశాల భవన పునర్నిర్మాత తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ఉన్నత ఆశయాల స్ఫూర్తితో పాఠశాలకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారీ రాజు, ఇతర ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.



