నూతన సంవత్సరంలో మంత్రి అనగాని తొలి సంతకం
అమరావతి : రాష్ట్రంలో 22ఎ జాబితాలో ఉన్న ఐదు రకాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించామని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన దస్త్రంపై గురువారం సచివాలయంలో సంతకం చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతన సంవత్సరం కానుకగా రైతులకు, భూ యాజమానులకు ఉపశమనం కల్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశంతో ఐదు రకాల భూములను 22ఎ జాబితా నుంచి తొలగించామని చెప్పారు. మాజీ, ప్రస్తుత సైనిక ఉద్యోగులు, స్వాతంత్య్ర సమర యోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు, 1954 జూన్ 18కు ముందు అసైన్ చేసిన భూములు, ప్రైవేట్ పట్టా భూములను 22ఎ నుంచి తొలగించినట్లు చెప్పారు. భూ కేటాయింపులు కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ గానీ 10(1) రిజిస్టర్, అడంగల్స్, ఎస్‌ఎఫ్‌ఎ వంటి పాత రెవెన్యూ రికార్డులు, ఎసైన్‌మెంట్ రిజిస్టర్లు లేదా డిఆర్ దస్త్రాలు, డికెటి పట్టాల్లో ఏదైనా ఒకటి ఉన్నా 22ఎ నుంచి తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు.
అధిక పత్రాలు కావాలంటూ భూ యజమానులను తిప్పుకోవద్దన్నారు. కొంత భూమి కోసం ఆ సర్వే నెంబర్‌లో ఉన్న మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంటే అటువంటి భూమిని సబ్ డివిజన్ చేసి నిషేధిత జాబితాలో ఉంచుతామని తెలిపారు. షరతులు గల పట్టా భూములు, సర్వీస్ ఇనామ్ భూములు, గతంలో నిషేధిత జాబితా నుంచి తొలగించినప్పటికీ సర్వే సమయంలో మరలా 22ఎ చేర్చిన చుక్కల భూములు, గతంలో 22ఎ నుంచి తొలగించిన చుక్కల భూములపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రీ హోల్డ్ భూములపై కూడా రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు 21.80 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామని, చివరి రోజు సిఎం ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.
రెవెన్యూ శాఖలోకి సచివాలయ సిబ్బంది
క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఉండటం వల్ల రెవెన్యూ ఉద్యోగులపై అదనపు భారం ఉన్న మాట వాస్తవమేనని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానంగా చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని అదనపు సిబ్బందిని ఈ శాఖలోకి తీసుకునేందుకు ఒక కమిటీ నియమించినట్లు తెలిపారు. రెవెన్యూ వ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రజలకు అనుకూలంగా మార్చేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామన్నారు. వైసిపి ప్రభుత్వంలో పెద్దయెత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని, వీటిపై సమగ్రంగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. నకిలీ రిజిస్ట్రేషన్లను ఏమాత్రం ఉపేక్షించబోమని, వీటిని రద్దు చేసే అధికారం జిల్లాల కలెక్టర్లకు ఇస్తున్నామని వివరించారు.



