- Advertisement -
- నేటి నుంచి గ్రామాల్లో తీర్మానాలు చేసి మోడీకి పంపించాలి : టి.సాగర్, భూపాల్, వెంకట్రాములు పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పత్తి దిగుమతులపై 50శాతం పన్ను విధించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.భూపాల్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై గురువారం నుంచి గ్రామాల్లో తీర్మానాలు చేసి ప్రధానమంత్రికి పంపించాలని పిలుపునిచ్చారు.
పత్తి దిగుమతులపై 11శాతం పన్ను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్తి దిగుమతిపై ఉన్న 11శాతం పన్నును రద్దు చేయడం వల్ల రైతాంగాన్ని కష్టాల్లోకి నెట్టడమేనని తెలిపారు. పంట చేతికొచ్చిన తర్వాత మార్కెట్‌లో మద్దతు ధరలు లేక దళారులకు తమ ఉత్పత్తులను కారుచౌకగా అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా పెట్టిన పెట్టుబడులు చేతికి రాక దేశ రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ దేశ రైతాంగానికి అనుకూలమైన విధానాలను రూపొందించి అమలు చేస్తామని ప్రకటించిన మూడు రోజులకే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడి ఆంక్షలకు తలొగ్గి ఆగస్టు 19న పత్తి దిగుమతులపై ఉన్న 11శాతం సుంకాన్ని రద్దు చేస్తూ పెట్టుబడిదారి దేశాల దిగుమతులకు ఎర్ర తివాచీ పరచి ఆహ్వానించడం సిగ్గుచేటన్నారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులను అందించడం లేదని చెప్పారు. పంట పెట్టుబడిపై 50 శాతం కలిపి మద్దతు ధరలు నిర్ణయిస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలనీ, రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలనీ, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని కోరారు. పత్తి కింటాలుకు రూ. 10,075 నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పత్తిని సేకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు వీఎస్ రావు, రమేష్, శ్రీకాంత్, సోమన్న, రైతు సంఘం నాయకులు పి.జంగారెడ్డి, మూడ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -