– 56 మందికి జైలు, రూ. 4.92 లక్షల జరిమానా
– మద్యం మత్తులో డ్రైవింగ్‌పై కఠిన చర్యలు
– ఎస్పీ రాజేష్ చంద్ర
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నామని కామారెడ్డి ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఒకే రోజు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 525 మందిని పట్టుకుని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జైలు శిక్షలు, భారీ జరిమానాలు విధించింది. మొత్తం కేసుల్లో 56 మందికి జైలు శిక్షలు పడగా, 40 మందికి ఒక రోజు, నలుగురికి రెండు రోజులు, 9 మందికి 5 రోజులు, ముగ్గురికి 7 రోజుల జైలు శిక్ష విధించారు. అదనంగా మొత్తం రూ. 4,92,400 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, మాట్లాడుతూ మద్యం మత్తులో వాహనం నడపడం చట్టరీత్యా నేరమే కాకుండా ప్రాణాంతకమని హెచ్చరించారు. “ఒక్కరి నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది” అని పేర్కొన్నారు.
ప్రజలు తమ కుటుంబాల కోసం బాధ్యతగా వ్యవహరించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లాలో తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.



