కేరళంలో ఎల్‌డీఎఫ్ ఎన్నికల మ్యానిఫెస్టో 2026 విడుదల
కోజికోడ్ : కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దశాబ్ద కాలంగా తమ పాలనలో సాధించిన సమగ్ర ప్రగతిని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా 60 సూత్రాల కార్యక్రమం.. 950 నిర్దిష్ట హామీలతో కూడిన మ్యానిఫెస్టోను లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) గురువారం విడుదల చేసింది. కోజికోడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య మంత్రి పినరయి విజయన్ ఈ మ్యానిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎల్‌డీఎఫ్ కన్వీనర్ టి.పి. రామకృష్ణన్, సీపీఐ నాయకులు ప్రకాష్ బాబు, కె. కృష్ణన్‌కుట్టి, ఎ.కె. ససీంద్రన్, ఏలమారం కరీం తదితరులు హాజరయ్యారు. ఐదేండ్లలో కేరళాన్ని ఒక విజ్ఞాన సమాజంగా మార్చాలనే దార్శనికతతో ఈ మ్యానిఫెస్టో రూపొందించబడింది. ఎల్‌డీఎఫ్ పాలనలో గత పదేండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించడంతో ఇది ప్రారంభమవుతుంది. ప్రతి హామీకి ఒక వివరణాత్మక గమనిక జత చేయబడింది. వివిధ రంగాలలో కేరళం పొందిన జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును కూడా ఈ పత్రం ప్రస్తావిస్తుంది. ఇది లౌకికవాదంలో పాతుకుపోయిన నిబద్ధతగా, కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంతర నిర్లక్ష్యానికి ప్రతిఘటనగా స్పష్టంగా ప్రదర్శించబడింది.
ప్రధాన వాగ్దానాలు
ఎల్డీఎఫ్ పాలనలో విస్తృతంగా గుర్తించబడిన తీవ్ర పేదరికం నిర్మూలనను కొనసాగిస్తూ, సంపూర్ణ పేదరికాన్ని నిర్మూలిస్తామని ఈ మ్యానిఫెస్టోలో తెలిపారు. గత యూడీఎఫ్ ప్రభుత్వ హయాంలో 600 నుంచి దశాబ్ద కాలంలో రూ.2,000కు పెంచబడిన సంక్షేమ పింఛన్లను, రూ.3,000కి పెంచుతామని వాగ్దానం చేసింది. ఉద్యోగ కల్పన విషయంలో, విద్యావంతులైన యువతకు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లకు హామీ, ‘బ్యాక్ టు క్యాంపస్’ పథకం, వ్యవస్థాపకత కోసం వడ్డీ లేని రుణాల ను అందిస్తామని తెలిపింది. 50 శాతం మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, 20 లక్షల మంది గృహిణులకు ఉపాధి హామీ ఇవ్వడం ద్వారా మహిళా అభ్యున్నతిని కూడా ఈ మ్యానిఫెస్టో ప్రస్తావిస్తుంది. విద్యా రంగంలో, ఉన్నత విద్యను ప్రపంచ స్థాయికి తీసుకురావడం, ప్రభుత్వ పాఠశాలల్లోని అభ్యసన అంతరాలను పరిష్కరించడం, సాంకేతిక విద్యను విస్తరించడం వంటి వాగ్దానాలు చేసింది.
ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి , కార్మికుల హక్కులను పరిరక్షించడానికి చర్యలతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సవరణకు కూడా కట్టుబడి ఉంది. మౌలిక సదుపాయాల హామీలలో విద్యుత్ కోతలు లేని కేరళం, స్మార్ట్ రోడ్ నెట్‌వర్క్‌లు, హై-స్పీడ్ రైలు కారిడార్ , విస్తరించిన రైలు అనుసంధానం, పటిష్టమైన జల రవాణా , వాటర్ మెట్రో సేవలు, ఇంకా ‘నవ కేరళం’ కోసం ఒక కొత్త ప్రజా ప్రణాళికా ప్రచారం వంటివి ఉన్నాయి. ప్రభుత్వ రంగాన్ని విస్తరించడం, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం, మిషన్ 100000ను ప్రారంభించడం, తోటల పెంపకం , సాంప్రదాయ పరిశ్రమలను ఆధునీకరించడం, రైతులకు మద్దతు ధరలను పెంచడం, కేఎస్‌ఆర్టీసీని లాభదాయకంగా మార్చడం , తగ్గించడం వంటి వాటికి కూడా ఈ మ్యానిఫెస్టో కట్టుబడి ఉంది.



