ఆక్రమణలో 30 వేల నాలాలు.. ఆగని కబ్జాలు
అడ్డుకట్టకు దూకుడు పెంచిన హైడ్రా
నగరంలో 10వేల కిలోమీటర్ల మేర వర్షం నీటి డ్రైన్లు అవసరం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణపై చర్యల్లో హైడ్రా మరింత దూకుడు పెంచింది. ప్రముఖ నాయకులు, సినీహిరోలు, బిల్డర్లు, పలుకుబడివున్న బడా నేతలు అనే తేడా లేకుండా హైడ్రా తన పనిని చేసుకుంటూ పోతోంది. చెరువుల ఆక్రమణలు, ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు, లేఔట్లు వేసినా భారీ పోలీస్ బందోబస్తుల మధ్య జేసీబీలతో కూల్చేస్తున్నారు. ఊహించిన దానికంటే హైడ్రాకు స్థానికులు, బాధితుల నుంచి మద్దతు లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాను విస్తరించాలని జిల్లాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి.
అక్రమ నిర్మాణాలు.. బయటకు వెళ్లని వరద నీరు
ఎన్ని చర్యలు చేపట్టినా నగరంలో జోరుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. కబ్జాల కారణంగా గ్రేటర్ పరిధిలో ఉన్న గొలుసుకట్టు చెరువులు చాలా మేరకు వాటి విస్తీర్ణాన్ని కోల్పోయాయి. పార్కులు, ఖాళీ స్థలాలు, గుట్టలు, నాలాలు, చివరికి ఆలయాలు కబ్జాకు గురవుతున్నాయి. ఈ క్రమంలో వరద నీరు బయటకు పోయేందుకు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఈ విషయం చాలా సర్వేల్లో తేలింది. నగరంలో 9వేల కిలో మీటర్ల రోడ్లలో 5వేల కిలో మీటర్ల ప్రధాన రోడ్లుండగా, దాదాపు 10వేల కిలో మీటర్ల మేర వర్షం నీటి డ్రైన్లు అవసరం ఉంది.
కానీ గ్రేటర్‌లో కేవలం వెయ్యి కిలో మీటర్లే వర్షం నీటి డ్రైన్లున్నాయి. ఒక వైపు కబ్జాలు.. మరో వైపు రోడ్లను విస్తరిస్తున్న క్రమంలో డ్రెయిన్ వాటర్ లైన్లు కనిపించకుండా పోతున్నాయి. దీనికితోడు అభివృద్ధి పేరుతో అపార్ట్‌మెంట్లు, కాంప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌లు షాపింగ్ మాల్స్ ఇలా తదితర వాణిజ్య వ్యాపార భవంతులు వెలుస్తుండటంతో చినుకు పడితే సిటీలోని రోడ్లన్నీ చెరువులుగా మారుతున్నాయి. కాలనీలు, బస్తీలు నీట మునుగుతున్నాయి. ఈ క్రమంలో వరదలు ముంచెత్తని నగరమే లక్ష్యంగా హైడ్రా చర్యలు తీసుకుంటోంది.
50ఏండ్లలో 6.2 రెట్లు పెరిగిన జనాభా
పట్టణీకరణ శరవేగంగా పెరుగుతోంది. హైదరాబాద్‌లో 1975 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ 6.2 రెట్లు జనాభా పెరిగింది. సహజ వనరులు మాత్రం తగ్గిపోతున్నాయి. 1975 – 2024 సంవత్సరాల మధ్య నగరంలో ఉన్న చెరువుల్లో 61 శాతం మాయమయ్యాయని ఎన్.ఆర్.ఎస్.సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) డేటా చెబుతోంది. ఈ క్రమంలో చెరువులు, కుంటలు, కాలువలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరాన్ని హైడ్రా గుర్తించింది. ఇందులో భాగంగానే నగరంలో గొలుసుకట్టు చెరువులతోపాటు వాటిని అనుసంధానం చేసే వరద కాలువల పునరుద్ధరణపై హైడ్రా చర్యలు చేపట్టింది.
బఫర్ జోన్‌పై అవగాహన
ఇప్పటికైనా మేల్కోకపోతే ఉన్న చెరువులు కూడా మాయమై.. వరద నీరు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికే నగరంలో 30 వేల నాలాలు ఆక్రమణలకు గురైనట్టు హైడ్రా గుర్తించింది. జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ, ఫైర్ శాఖలకు చెందిన చట్టాలను హైడ్రాకు అప్పగించడం ద్వారా ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో 24 చెరువుల పునరుద్ధరణను చేపట్టిన హైడ్రా, ఇప్పటికే 3 చెరువులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదిలావుండగా చెరువులు, కాలువలు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ అంటే నగర ప్రజలకు స్పష్టమైన అవగాహన తీసుకొచ్చారు. దాంతో నిర్మాణ సంస్థలతోపాటు ఇల్లు కొనాలనుకునేవారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



