Monday, July 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఆహారం వికటించి 65 మందికి అస్వస్థత

ఆహారం వికటించి 65 మందికి అస్వస్థత

- Advertisement -

– నాగర్‌ కర్నూల్‌ జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలింపు
– విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే రాజేష్‌ రెడ్డి
– ఆస్పత్రిలో విద్యార్థుల పరామర్శ
నవ తెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / తాడూర్‌

నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ జ్యోతిరావు ఫూలే బాలిక గురుకులంలో శనివారం రాత్రి ఆహరం వికటించి 65మందికి విద్యార్థినులు అస్వస్థతకు గురవడంతో వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వారిని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. కాగా, గురుకులంలో శనివారం సాయంత్రం స్నాక్‌తో పాటు రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటికే 9 మంది విద్యార్థినులకు కడుపునొప్పి రావడంతో 108కు ఫోన్‌ చేసి ఆస్పత్రికి తరలించారు. అనంతరం కడుపునొప్పి, వాంతులతో మరో 56 మంది విద్యార్ధులూ అస్వస్థతకు గురవడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే నాగర్‌కర్నూల్‌ ఆర్టీఓ సురేష్‌ ఆస్ప త్రికి చేరుకొని విద్యార్థినులతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యసిబ్బందికి సూచించారు.
ఆస్పత్రిలో విద్యార్థులను పరామర్శించిన మంత్రి జూపల్లి
ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థినులను మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి పరామర్శించారు. విద్యార్థులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఆస్వస్థతకు గత కారణాలపై పాఠశాల ప్రిన్సిపాల్‌, గురుకులాల రీజినల్‌ కో-ఆర్డినేటర్‌, జిల్లా విద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి తల్లితండ్రులకు మంత్రి భరోసా ఇచ్చారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని మంత్రి తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు.
బాధితులపై చర్యలు తీసుకోవాలి :సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు
ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థినుల అస్వస్థతకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్‌ చేశారు. ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్ధులను సీపీఐ(ఎం) బృందం ఆస్పత్రిలో పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. పాఠశాలలో చెడిపోయిన పెరుగును పిల్లలకు ఇవ్వడంతోనే వారు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడినప్పుడు పాఠశాలలో మెనూ అమలు కావడం లేదని, మొత్తం నాసీరకం ఆహార పదార్థాలు ఇస్తున్నట్టు తెలిపినట్టు చెప్పారు. విద్యార్థులను పట్టించుకోవాల్సిన ప్రిన్సిపాల్‌, వార్డెన్‌ బాధ్యతారహిత్యంగా ఉండటం వల్లనే ఇలా జరిగిందని, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -