గ్రేటర్‌లో ఎస్పీడీసీఎల్ ఏర్పాట్లు
– అదనంగా 104 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు
– విధుల్లో 101 సబ్‌డివిజన్ స్థాయి టీంలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం సజావుగా జరిగేందుకు తమ వంతుగా టీజీఎస్పీడీసీఎల్ భద్రతా ఏర్పాట్లు చేసింది. శోభాయాత్ర నిర్వహించే రూట్లలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూడు జోన్ల పరిధిలో 68 ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు, అదనపు లోడ్‌లను అందుకోవడానికి అదనంగా 104 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. విధుల్లో 101 సబ్ డివిజన్ స్థాయి టీంలు నిమజ్జన కార్యక్రమం ముగిసే వరకు నిరంతరం అందుబాటులో ఉండేలా డ్యూటీ చార్ట్ విద్యుత్ అధికారులకు సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలు జారీ చేశారు.
అధికారులతో సీఎండీ టెలీ కాన్ఫరెన్స్
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వచ్చే నెల 6న నిర్వహించనున్న గణేష్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమానికి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తగు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు శనివారం సంస్థ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జోనల్ చీఫ్ ఇంజినీర్లతో, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంస్థ డైరెక్టర్లు శివాజీ, డాక్టర్ నర్సింహులు, చక్రపాణి, కృష్ణారెడ్డి, మేడ్చల్ జోన్ చీఫ్ ఇంజినీర్ కామేష్, రంగారెడ్డి జోన్ చీఫ్ ఇంజినీర్, పాండ్య, మెట్రో జోన్ చీఫ్ ఇంజినీర్ ప్రభాకర్‌కు పలు కీలక సూచనలు చేశారు. పెద్ద విగ్రహాలు ప్రతిష్టించిన మండపాలను, ఆ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే వీధులను, రహదారులను పరిశీలించాలని తెలిపారు. రోడ్ క్రాసింగ్‌లు, వదులుగా ఉన్న తీగలను సరి చేయటం, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఎర్తింగ్, అవసరమైన చోట ఇన్సులేషన్ ఏర్పాటు, ఇనుప స్తంభాలు, ఫ్యూజ్ బాక్సులు ఉన్న చోట పీవీసీ పైపులు, ప్లాస్టిక్ షీట్లు ఏర్పాటు చేయడం వంటి పనులు పూర్తి చేసినట్టు అధికారులు సీఎండీకి తెలియజేశారు. దీనికి తోడు ప్రతి సెక్షన్ పరిధిలో నిరంతరం అందుబాటులో ఉండే విధంగా షిఫ్టుల వారీగా సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. గ్రేటర్‌లో వివిధ విభాగాలైన ఆపరేషన్, లైన్స్, సీబీడీలకు చెందిన 101 సబ్ డివిజన్ స్థాయి టీంలకు తోడు ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది కూడా విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.
అదనంగా ట్రాన్స్‌ఫార్మర్లు
మేడ్చల్ జోన్ పరిధిలో 71 నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేకంగా 31 కంట్రోల్ రూమ్స్, అదనంగా 43 డిస్ట్రిబ్యూ షన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జోన్ పరిధిలో 29 నిమజ్జన ప్రాంతాల్లో 25 కంట్రోల్ రూమ్స్, అదనంగా 22 డిస్ట్రిబ్యూ షన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. మెట్రో జోన్ పరిధిలో 10 ప్రాంతాల్లో ప్రత్యేకంగా 12 కంట్రోల్ రూమ్స్, అదనంగా 39 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు.
విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత
నిమజ్జనం నేపథ్యంలో పెద్ద విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే మార్గాలను విద్యుత్ అధికారులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎలాంటి అవాంతరాలూ జరగకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాలి. నగరంలో నిమజ్జన కార్యక్రమంలో విద్యుత్ సరఫరా తీరు తెన్నులను పర్యవేక్షించడానికి, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకునేందుకు సంస్థ డైరెక్టర్‌లను, చీఫ్ ఇంజినీర్లను ఇన్‌చార్జీలుగా నియమించాం.
– ముషారఫ్ ఫరూఖీ, సీఎండీ, టీజీ ఎస్పీడీసీఎల్