సమస్యల్లో కల్లుగీత కార్మికులు
పరిష్కారం కోసం అనేక ఆందోళనలు
గీత కార్మికుల హక్కుల సాధనే ధ్యేయంగా నేటి నుంచి సూర్యాపేటలో రాష్ట్ర మహాసభ
నవతెలంగాణతో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు
ములాఖాత్
నవతెలంగాణ – సూర్యాపేట
”గీత కార్మికుల హక్కుల కోసం 68 ఏండ్లుగా పోరాడు తున్నాం.. ఇంకా అనేక సమస్యలు పరిష్కారానికి నోచు కోలేదు. పెన్షన్, ఎక్స్‌గ్రేషియా, రక్షణ పరికరాలు, నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు, చెట్ల పెంపకానికి భూములు అత్యవసరం” అని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు అన్నారు. సూర్యాపేట పట్టణంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ జరగనుంది. రాష్ట్ర 4వ మహాసభ ఈనెల 28, 29, 30 తేదీల్లో జరగనున్నాయి. తొలి రోజు భారీ ప్రదర్శన, బహి రంగ సభ ఉంటుంది. రాష్ట్ర మహాసభ కల్లుగీ త కార్మికుల ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా మారనుంది. సంప్రదాయ వృత్తిని కాపాడుకోవడం, గీత కార్మికుల జీవనోపా ధిని బలపర్చడం, పెండిం గ్ సమస్యల పరిష్కార దిశగా ఈ మహాసభలో చర్చకు రానున్నట్టు బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. మహాసభ ఏర్పాట్లు, పర్యవేక్షణపై గురువారం ఆయన ‘నవతెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరాయా?
పెన్షన్‌ను రూ.4,000కు పెంచుతామని, ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. గీత కార్మికులు ప్రమాదానికి గురైతే ఎక్స్‌గ్రేషియా వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. వీటిలో నేటికీ ఒక్క హామీ అమలు కాలేదు.
మహాసభ తరువాత తదుపరి కార్యాచరణ ఏమిటి?
గీత కార్మికుల శ్రమను గుర్తించి వారికి ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని మహాసభ డిమాండ్ చేస్తుంది. కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.5000 కోట్లు కేటాయించాలి. ప్రమాదాలకు గురైన గీత కార్మికుల పెండింగ్ ఎక్స్‌గ్రేషియా విడుదల చేయాలి. ప్రతి సొసైటీకీ చెట్ల పెంపకానికి ఐదెకరాల భూమి ఇవ్వాలి. కల్లులోని పోషకాలు, ఔషధ గుణాలపై ప్రభుత్వం ప్రచారం చేయడం ద్వారా మార్కెట్‌ను విస్తృతం చేయాలి. ప్రభుత్వం స్పందించకపోతే నిరసనలు, దీక్షలు, భారీ ర్యాలీలు చేపడతాం.
సూర్యాపేటలో నిర్వహించడానికి ప్రత్యేక కారణం?
సూర్యాపేట ఉద్యమాలకు పురిటిగడ్డ. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాడిన ఎన్నో చారిత్రక కార్యక్రమాలకు ఈ పట్టణం వేదికైంది. అందుకే రాష్ట్ర 4వ మహాసభను ఇక్కడ నిర్వహించాలని నిర్ణయించాం. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా గీత కార్మికులు హాజరవుతారు.
గీత కార్మికుల ప్రస్తుత పరిస్థితి ఏంటి..?
తెలంగాణలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఎన్నో ఇబ్బందులకు లోనవుతున్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చు కోవాలంటే ప్రభుత్వాల సహకారం ఎంతో అవసరం. కానీ వృత్తి పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క పథకం కూడా పెట్టలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు కాలేదు. అధికారుల ను, మంత్రులను కలిసినా ఫలితం లేదు. కష్టాల్లో ఉన్న గీత కార్మికులకు ప్రభుత్వం చేయూత అవసరం. 50 ఏండ్లు నిండిన గీత కార్మికులకు వృద్ధాప్య పెన్షన్ అందించాలి, మరణించిన గీతకార్మికుని భార్యకు వెంటనే పెన్షన్ వర్తింపజేయాలి, ప్రతి సొసైటీకీ చెట్ల పెంపకానికి ఐదు ఎకరాల భూమి కేటాయించాలి.



