కథానాయకుడు నితిన్ ఫ్లాప్‌ల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. గత ఐదేండ్లుగా అర డజను ఫ్లాప్‌లతో ఉన్న ఆయన తాజాగా ‘తమ్ముడు’ రూపంలో మరో ఫ్లాప్‌ని దక్కించుకున్నారు.
‘నా నుంచి ఈమధ్య కాలంలో సరైన సినిమాలు రాలేదు. నా సినిమాలన్ని అటు ప్రేక్షకుల్ని, ఇటు నా అభిమానుల్ని నిరాశ పరిచాయి. ఇకపై మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్‌లతోనే సినిమాలను చేస్తాను. మంచి కంటెంట్‌తో చేసిన ‘తమ్ముడు’ సినిమా కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది’ అని ఇటీవల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ చెప్పారు. అయినప్పటికీ ‘తమ్ముడు’ ఫ్లాప్ టాక్‌ని మూటకట్టుకుంది.
దిల్‌రాజు బ్యానర్, నానితో ‘మిడిల్‌క్లాస్ అబ్బాయి’ (ఎంసిఎ), పవన్‌కళ్యాణ్‌తో ‘వకీల్‌సాబ్’ వంటి హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘తమ్ముడు’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఏమాత్రం లేకపోవడం గమనార్హం.
అక్కకి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఓ ‘తమ్ముడు’గా నితిన్ ఏం చేశాడు అనేదే ఈ సినిమా. ఇలాంటి పేలవమైన పాయింట్‌తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘తమ్ముడు’ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోగా, నీరసం తెప్పించింది.
అసలు ఇలాంటి రొడ్డకొట్టుడు పాయింట్ చెప్పి నిర్మాత దిల్‌రాజుని దర్శకుడు వేణు శ్రీరామ్ ఎలా ఇంప్రెస్ చేశాడా అనే అనుమానమూ కలుగుతుంది.
తన కథని చెప్పేందుకు దర్శకుడు వేణు శ్రీరామ్ భిన్న నేపథ్యాన్ని ఎంచుకున్నారు. కథ ప్రారంభమైన కొద్ది సేపటి వరకు ఆయన చెప్పదల్చుకున్న పాయింట్ సరైన్ ట్రాక్‌లోనే వెళ్ళింది. ఎప్పుడైతే హీరో తన అక్క కోసం అడవికి వస్తాడో.. అక్క డ్నుంచి ప్రేక్షకుల సహసానికి పరీక్ష పెట్టింది.
ఇక ఈ సినిమా ఏ జోనర్ సినిమా అని చెప్పడం కూడా కష్టమే. ముందు ఓ ఎమోషనల్ డ్రామాలా మొదలయ్యే ఈ కథ ఆ తరువాత యాక్షన్ జోనర్ లోకి వెళ్తుంది. ఛేజింగ్‌లు, క్రైమ్, డ్రామా.. ఇలా రక రకాలుగా మారుతూ బోర్ కొట్టించింది.
ఈ సినిమా కోసం దర్శకుడు సృష్టించిన ‘అంబర గొడుగు’ అనే ఫాంటసీ ప్రాంతం ఐడియా చాలా బాగుంది. కాకపోతే దాన్ని కూడా ఇంపాక్ట్‌ఫుల్‌గా చూపించ లేకపోయాడు. ప్రతినాయకుడు సౌరభ్ సచ్‌దేవా పాత్రను కూడా మంచిగా డిజైన్ చేశారు.
ఈ సినిమాలో నటించిన మహిళల పాత్రలను దర్శకుడు తీర్చిదిద్దిన విధానాన్ని అభినందించాల్సిందే. చాలా అరుదుగా ఇలాంటి ధైర్యం ఉన్న, శక్తివంతమైన మహిళల పాత్రలను చూస్తుంటాం.
చాలా కాలం తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన లయ అద్భుతంగా నటించింది. ఆమెతో పాటు సప్తమిగౌడ, వర్ష బొల్లమ్మ పాత్రలు అలరిస్తాయి. ఇందులో జై అనే ఆర్చరీ క్రీడాకారుడిగా నితిన్ కనిపిస్తాడు. ఆయన నటనలో ఏ మాత్రం కొత్తదనం కనిపించదు. అజనీష్ లోకనాథ్ సంగీతం, కె.వి.గుహన్, సమీర్‌రెడ్డి కెమెరా పనితనం, కళా దర్శకత్వం, నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే ఎడిటింగ్ విషయంలో ప్రవీణ్ పూడి నిర్లక్ష్యం చేశారు. బలం లేని కథ, కథనాలతో కొరవడిన భావోద్వేగాలతో ‘తమ్ముడు’ అందర్నీ నిరాశ పరిచాడని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. వరుస ఫ్లాప్‌లకు కారణాలను విశ్లేషించుకుని ఇకనైనా సరైన స్క్రిప్ట్‌లను ఎంచుకోకపోతే హీరోగా నితిన్ రాణించడమూ కష్టమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
– రెడ్డి హనుమంతరావు
ఫ్లాప్‌ల పరంపర..
1) చెక్
2) రంగ్‌దే
3) మాస్ట్రో
4) మాచర్ల నియోజకవర్గంలో..
5) ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్
6) రాబిన్ హుడ్
7) తమ్ముడు
‘తమ్ముడు’తో 7 ఫ్లాప్‌లు..
- Advertisement -
- Advertisement -