– ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావును విచారించిన అధికారులు
– నాకు సంబంధం లేదన్న మాజీమంత్రి
– ఆధారాలు ఉన్నాయి కాబట్టే పిలిచామన్న పోలీసులు
– ఉంటే ఆధారాలు చూపాలన్న హరీశ్
– ఏసీపీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళనలు, అరెస్ట్‌లు
– పరిస్థితి ఉద్రిక్తం.. పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ప్రకంపనలు రేపిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును సిట్ అధికారులు దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. మధ్య మధ్యలో విరామమిస్తూ అధికారులు హరీశ్‌రావుకు ప్రశ్నలు సంధించగా మధ్యలో హరీశ్‌రావు సైతం సిట్ అధికారులకు రివర్స్ ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. ఒకవైపు హరీశ్‌రావును ప్రశ్నించే ప్రక్రియ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో కొనసాగుతుండగా.. వెలుపల భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ శ్రేణులు హరీశ్‌రావుకు మద్దతుగా చేసిన నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కార్యాల యం వైపు దూసుకొస్తున్న కార్యకర్తలను సాయుధ పోలీసులు పలుమార్లు వెనక్కి నెట్టేయడం, వినకు ండా తోసుకు వచ్చినవారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించడం వంటి చర్యలు పలుమార్లు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో అందరి దృష్టినీ ఆకర్షించిన హరీశ్‌రావు విచారణ అంకం వివరాల్లోకి వెళ్తే.. ఫోన్‌ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన నోటీసు మేరకు హరీశ్‌రావు.. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులు వెంట రాగా మొదట బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు కార్యకర్తలు, నాయకులతో మాట్లాడిన హరీశ్‌రావు తిరిగి జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి ఉదయం 11 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. వెలుపల వేచి ఉన్న మీడియా ప్రతినిధులకు అభివాదాలు తెలుపుతూ రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకే సిట్ అధికారులు తనను పిలిచారనీ, ఇదంతా ఒక డ్రామా అంటూ ఏసీపీ కార్యాలయంలోకి వెళ్లారు. లోపల హరీశ్‌రావు కోసం వేచి ఉన్న సిట్ అధికారులు నగర స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ విజరు కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణ్‌రెడ్డి, గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ కమాండెంట్ రవీందర్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి విచారణను ప్రారంభించారు.
హరీశ్‌రావును మొదట ఎందుకు పిలిపించినట్టో కారణాలు తెలిపిన అధికారులు.. అనంతరం ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు తాము విచారించిన అధికారులు మీ పేరునే చాలా సందర్భాల్లో బయటపెట్టారు. ఇందులో మీ పాత్ర ఎంత అని ప్రశ్నించగా.. అందుకు మీ వద్ద ఉన్న ఆధారాలు ఏంటనీ హరీశ్‌రావు ఎదురు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఓ ప్రయివేటు న్యూస్ ఛానెల్ సీఈఓ శ్రవణ్‌రావులు చాలా సార్లు మీరిచ్చిన ఆదేశాలు, పంపిన ఫోన్ నెంబర్లు, తెలిపిన పేర్ల ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ జరిపి, సమాచారాన్ని మీకు పంపినట్టు తెలిపారని సిట్ అధికారులు తెలపగా .. తాను హౌం మంత్రిని కాదనీ, తనకు ఈ విషయంతో సంబంధం లేదని హరీశ్‌రావు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. శ్రవణ్‌రావు ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించి సేకరించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలోని భవనంలో అమర్చి ట్యాపింగ్ వ్యవహారాన్ని జరపడం వెనక మీ హస్తం ఉందంట కదా అనే ప్రశ్నకు… అనేక మంది అనేక విషయాలు చెప్తుంటారు, వాటన్నిటినీ నమ్మేస్తామా అంటూ హరీశ్‌రావు సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. ప్రశ్నల పరంపరను అధికారులు కొనసాగించగా.. నాకు సంబంధం లేనివి, నేను తలదూర్చని, నాకు తెలియని ప్రశ్నలు వేస్తే ఎలా అంటూ హరీశ్‌రావు ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. శ్రవణ్‌రావు, ప్రభాకర్‌రావుతో పాటు తాము ఇది వరకు అరెస్ట్ చేసి ప్రశ్నించిన అధికారులతో హరీశ్‌రావు పలుమార్లు మాట్లాడిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయనీ, ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంతో పాటు అంతకముందు జరిగిన ఉప ఎన్నికల సందర్భంలో సదరు అధికారులతో పలుమార్లు మాట్లాడిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని సిట్ అధికారులు సూటిగా ప్రశ్నించగా… కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం, అంత మాత్రానా తప్పు చేసినట్టా అని కూడా హరీశ్‌రావు అధికారులకు చెప్పినట్టు తెలిసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లను ఎందుకు మీరు ప్రశ్నించరని కూడా హరీశ్‌రావు సిట్ అధికారులను నిలదీసినట్టు సమాచారం.
కాగా సిట్ అధికారులు మధ్య మధ్యలో విరామమిస్తూ పక్కకు వెళ్లి చర్చించుకొని తర్వాత వచ్చి ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. అధికారులు వేసిన కొన్ని ప్రశ్నలను దాటవేసిన హరీశ్‌రావు మరికొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయారని సమాచారం. మధ్యలో ఈ ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమైనవేననీ, ఈ ట్రాప్‌లో మీరెందుకు పడుతున్నారంటూ అధికారులతో హరీశ్‌రావు అన్నట్టు తెలుస్తోంది. అయితే తాము ఫోన్‌ట్యాపింగ్ కేసును పూర్తిగా చట్టపరిధిలోనే లభిస్తున్న ఆధారాలనుబట్టి దర్యాప్తు సాగిస్తున్నామనీ, ఇందులో ఎవ్వరి ఒత్తిడీ లేదని అధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది. కాగా అధికారులకు మధ్యమధ్యలో సిట్ అధినేత, నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తగిన ఆదేశాలిస్తూ ఈ విచారణను స్వయంగా పర్యవేక్షించారు. రాత్రి 7 గంటల వరకు సాగిన విచారణ ప్రక్రియను పూర్తిగా వీడియో చిత్రీకరణ చేయడంతో పాటు హరీశ్‌రావు వాంగ్మూలాన్ని కూడా అధికారులు రికార్డు చేశారు. అనంతరం 7.29 గంటలకు హరీశ్‌రావు వెలుపలికి రాగా… బయట వేచి ఉన్న వందలాది మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలకు అభివాదం చేస్తూ తాను తెలంగాణ భవన్‌లో మాట్లాడతానని చెప్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా హరీశ్‌రావును విచారిస్తున్నంత సేపు ఇంకెంత సేపు విచారిస్తారు. ఆయనను లోపల వేధిస్తున్నారంటూ కొందరు మహిళా కార్యకర్తలు లోపల పోలీసు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో అధికారులు వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. హరీశ్‌రావు విచారణ సాగినంత సేపు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
సిట్ ఎదుట 7 గంటలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



