– ఆగస్టు 4 నుంచి 7వరకు
– చిత్తశుద్ధి ఉంటే న్యాయపోరాటం చేయరెందుకు?
– బీహార్ ఎన్నికల్లో లబ్ది కోసమే కాంగ్రెస్ ఢిల్లీ ధర్నా : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో యునైటెడ్ ఫూలే ఫ్రంట్, బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 4 ఉదయం 11 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్‌లో నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. తెలంగాణ జాగతి, యూపీఎఫ్ చేసిన పోరాటాలకు దిగివచ్చే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్‌లో బీసీల కోసం రెండు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందే కానీ ఇంతవరకు ఆ ప్రయత్నం చేయలేదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ధర్నాను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీనే పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. మళ్లీ కాంగ్రెస్ ధర్నా చేస్తాననడం వంచించడమేనని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు గడువులోగా స్థానిక ఎన్నికలు నిర్వహించడం ఎంత ముఖ్యమో బీసీలకు రిజర్వేషన్ కోటా పెంచడం కూడా అంతే ముఖ్యమని కవిత అభిప్రాయపడ్డారు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకుంటే, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు న్యాయపోరాటం చేయలేదని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి ఎదురైన తమిళనాడు ప్రభుత్వం న్యాయపోరాటం చేసి రిజర్వేషన్లు సాధించుకున్న విషయాన్ని కవిత ఈ సందర్భంగా ఉదహరించారు. ఆర్డినెన్స్ విషయంలో ఎందుకు న్యాయపోరాటం చేయడం లేదో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ అడ్డు తగులుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపకపోతే మరోసారి శాసనసభ, శాసనమండలి ఆ బిల్లులకు ఆమోదం తెలిపి అమలు చేసుకోవచ్చని కవిత సూచించారు. బీసీ రిజర్వేషన్లు పెంచి అమలు చేసుకునేందుకు ఎన్నో అవకాశాలున్నా కేవలం పీఎం నరేంద్రమోడీని రక్షించేం దుకే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని ఆరోపించారు. బీజేపీతో ఉన్న ఒప్పందంతోనే రేవంత్ సర్కార్ కోర్టుకు వెళ్లడం లేదని దుయ్యబట్టారు. కేంద్రంపై ఒత్తిడి పెంచాలంటే వెంటనే హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తాం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారనీ, ఢిల్లీలో ధర్నా అంటే అదేమైనా సత్రం భోజనమా అని ప్రశ్నించారు. మంత్రి పొన్నం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేస్తే అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చిందని ఆమె గుర్తుచేశారు. బీసీ బిల్లుల కోసం అదే తరహాలో నిరాహారదీక్ష చేస్తానని స్పష్టం చేశారు. నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ ఉంటే అక్కడే నిరాహారదీక్షకు చేస్తానని తెలిపారు. ఈ సమా వేశంలో యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్, కో ఆర్డినేటర్ ఆలకుంట హరి, తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ నాయకులు నవీన్ ఆచారి, కొట్టాల యాదగిరి, పూసల శ్రీనివాస్, కుమారస్వామి, నరేశ్, మాధవి, వరలక్ష్మీ, రామ్ కోటి, విజయేంద్ర సాగర్, లలితా యాదవ్, గొరిగె నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
బీసీ బిల్లు కోసం 72 గంటల నిరాహారదీక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES