అన్నివేళలా అందరిచూపు తమమీద ఉండేట్టు చూసుకోవటం, అదే సమయంలో తమ అసలైన వ్యూహాలను మరుగుపరిచి అప్రధానమైన చర్చలు ముందుకు తోయటం సంఘపరివార్‌కు వెన్నతోపెట్టిన విద్య. అవసరమైన ప్రచారం చేసుకోవటంతో పాటు వ్యతిరేక ప్రచారం లేకుండా చూసుకోవడానికీ ఇదే పనికి వస్తుంది. వచ్చే సెప్టెంబరు 17తో నరేంద్ర మోడీకి 75 ఏళ్లు నిండుతాయి. గనుక ప్రధాని బాధ్యతల నుంచి తప్పిస్తారనే ఒక కథనం ముందుకురావడానికి అదే కారణం. మీడియా కట్టుకథలని ఆరోపించడానికి వీల్లేదు, వీలు లేకుండా స్వయంగా ఆరెస్సెస్ సర్‌సంఫ్‌ు చాలక్ మోహన్‌భగవత్ ఈ చర్చతీసుకొచ్చారు. దీనిపైన కావాలని మాట్లాడేవారు కొందరైతే, నిజంగానే ఏదో జరగబోతుందని స్పందించేవారు మరికొందరు. వాస్తవానికి ఈ చర్చ కొత్తదేమీ కాదు. ఇంకా చెప్పాలంటే మోడీకి సంబంధించింది మాత్రమే కూడా కాదు. ఆయనకన్నా వారం రోజుల ముందే సెప్టెంబర్ 11వ తేదీకే మోహన్ భగవత్‌కు 75 వస్తాయి. నరేంద్ర మోడీని దించి వేయడం జరుగుతుందనుకుంటే అప్పుడు ముందు ఆయన దిగిపోవాల్సి ఉంటుంది. మరి ఆ ఉసే ఎక్కడ వినిపించడం లేదు. 2004 ఎన్నికల ముందు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆరెస్సెస్ అధినేతగా ఉన్న కెఎస్ సుదర్శన్, ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్లందరూ దిగిపోవాలని చెబుతుండేవారు. చివరకు వాజ్‌పేయి భరించలేక ”నేను బాగా పనిచేసే స్థితిలోనే ఉన్నాను.
పదవి విరమణ ప్రసక్తి లేదని” కుండబద్దలు కొట్టారు. 2004లో ఓటమి తర్వాత అద్వానీ పాకిస్తాన్‌లో జిన్నాకు కితాబిచ్చాడంటూ పక్కన పెట్టడం, అని వార్యమైన తతంగంలా 2009లో మాత్రం ఓడిపోయే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం చూశాం. మరో ఐదేళ్ల తర్వాత 2013-14లో అభ్యర్థిగా ప్రకటించటం ఎంత ఆర్భాటంగా జరిగిందో దేశమంతా చూసింది. రామ రథయాత్ర ద్వారా బీజేపీ బలం అమాంతంగా పెరగడానికి, మొదటిసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజం వేసిన అద్వానీని ఒక ఓటమితో పక్కన పెట్టడం ఆరెస్సెస్‌కు తెలియకుండా మోడీ ఒక్కరేచేసే విషయం కాదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీకి అంబానీల నుంచి అమెరికాలో మాడిసన్ స్క్వేర్ వరకు బ్రహ్మ రథం పట్టడం వెనుక చాలాశక్తులు పనిచేశాయి. మత రాజకీయ సంస్థలు, కార్పొరేట్ సామ్రాజ్యాలదే అందులో కీలక పాత్ర. వారి అంచనాలకు వ్యూహాలకు తగినట్టే మోడీ పదేళ్ల పాలనలో అత్యధిక అత్యధిక వరాలు కట్టబెట్టారు. హిందుత్వ శక్తుల ప్రాబల్యాన్ని కొత్త ఎత్త్తులకు తీసుపోయారు. బడామీడియా వత్తాసుతో ఎప్పటికప్పుడు సరికొత్త చిట్కాలు మాయోపాయాలు ప్రయోగిస్తూ ప్రాంతీయ పార్టీలను గుప్పిట్లో పెట్టుకుని కపట రాజకీయాలు సాగించగలిగారు. ఇలాంటి నమ్మకమైన నాయకుడ్ని ఆరెస్సెస్ కానీ కార్పొరేట్ వర్గాలు కానీ అంత తేలిగ్గా వదులుకుంటాయా?
ఎందుకీ నాటకం?
కొందరిని కొంతకాలం, కొందర్ని అంతకాలం, అందర్నీ కొంతకాలం మాయ చేయవచ్చు గానీ అందర్నీ ఎల్లకాలం ఎవరు మోసగించలేరనేది సామెత. ఈ పదకోండేండ్ల పాలనలోనూ మోడీ ‘మన్ కీ బాత’్ ఏంటో సామాన్యులకు కూడా చాలావరకూ తెలిసిపోయింది. జాతీయ సమైక్యత, మత సామరస్యం,దేశ సార్వభౌమత్వం కాపాడుకోవాలన్న మెలకువ పెరిగింది. లౌకిక ప్రతిపక్షాలు కూడా కొంతవరకు కళ్లుతెరవ గలిగాయి.2024 మే ఎన్నికల నాటికి ఆయన ప్రభావం మసకబారిన విషయం స్పష్టమవడంతో విపరీతంగా డబ్బుకుమ్మరించి, అహోరాత్రులు ప్రచారం సాగించి పట్టు నిలబెట్టుకోవాలని పాకులాడారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా ఆ ఊపులోనే తమ పార్టీ ఇక ఎంత మాత్రం ఆరెస్సెస్ అదుపులో లేదని, స్వతంత్రంగా గెలవగలమనీ ఘనంగా చెప్పారు. అయినా దానిపై మోహన్ భగవత్ లాంటివారు పెద్దగా స్పందించింది లేదు. వెనక్కు తిరిగి చూస్తే ఇదంతా ఒక వ్యూహం అని స్పష్టం అవుతుంది. నిజంగా బీజేపీ స్వతంత్రమైంది అని అనుకున్న వారు ఓటేస్తే మూడోసారి అధికారం దక్కుతుంది అనే పాచిక మాత్రమే అది. ఎన్నికల ప్రక్రియపైనా ఎన్నో అనుమానాలు తలెత్తాయి. ఇలాంటి ఎన్నిఎత్తులు వేసినా దేశ ప్రజలు మోడీకి మూడోసారి మెజార్టీ ఇవ్వడానికి తిరస్కరించారు. కానీ బీహార్‌లో నితీశ్‌కుమార,్ ఏపీలో చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్ వంటి వారి వత్తాసుతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. మళ్లీ పుంజుకోవడానికి విద్వేష రాజకీయాలను రగిలించే ప్రయత్నాలు పెంచారు. రెండు మాసాల కిందట పహల్గాం ఉగ్రవాద ఘాతుకం తర్వాత సాగిన పరిణామాలు, ఆపరేషన్ సిందూర్ అస్తవ్యస్త పర్యవసానాలు బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరకాటంలో పెట్టాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విపరీత పోకడలకు తలవంచటం, ఇజ్రాయిల్ మారణకాండపై మౌన ముద్రదాల్చడం భారతదేశ ప్రతిష్టను భంగపరిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరొకసారి అధికారంలోకి రావడం అటుుంచి ఉన్నదాన్ని కాపాడుకోవడం, ఎన్నికలు జరిగే కీలక రాష్ట్రాల్లో గెలవడం కూడా పెనుసవాలుగా మారాయి. ఈ సంకట పరిస్థితి నుంచి కాపాడుకోవడానికి విసిరిన ఓ అస్త్రమే 75 ఏళ్ల రిటైర్మెంట్ ప్రహసనమా?
ముందే మొదలైంది
2024 మే ఎన్నికలకు ముందే మహారాష్ట్రలో ఇది మొదలైంది.’ 2025 సెప్టెంబర్ 16 నరేంద్ర మోడీ అధికారంలో కొనసాగే చివరి రోజు’ అని ఒక పోస్ట్ వైరల్‌గా నడిచింది. ఆ మాట చెప్పినవారు శివసేన ఎంపీ సంజరు రౌత్. 75 ఏళ్ల వయసు దాటితే సీనియర్లు కీలక పదవుల్లో నుంచి తప్పుకుని మార్గదర్శక మండల్‌లో ఉండి సలహాలు ఇవ్వాలనీ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు అప్పట్లో ప్రతిపాదించారు మరి ఆయనకూ అదే వయసు వస్తుంది. మూడు మాసాల కిందట నరేంద్ర మోడీ మొదటిసారిగా ప్రధాని హోదాలో నాగపూర్‌లోని ఆరెస్సెస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించటం, ఈ గండం నుంచి తప్పించుకోవడానికేనని సంజరు రౌత్ వంటివారు ఆరోపించారు. అంటే నిజంగానే వారి ఉభయుల మధ్య ఏదో వివాదం నడుస్తుందన్న భ్రమ కొనసాగించడానికి వేసిన ఎత్తుగడ అన్నమాట. కానీ మరోవైపున మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాత్రం మోడీ 2029 తర్వాత కూడా తమకు నాయకత్వం అందిస్తారని గొప్పగా ప్రకటించారు. తండ్రి బతికుండగానే ఆయన వారసత్వం గురించి చర్చించడం సంస్కారం కాదని కూడా ముఖ్యమంత్రి చెప్పడం గమనించదగ్గది. ఆపరేషన్ సిందూర్ లాంటి పరిణామాలు ఆ తర్వాత జరిగినవే కనుక మళ్లీ సరికొత్త నష్ట నివారణ చర్యలు అవసరమని సంఫ్‌ు పరివార్ భావించింది మోహన్ భగవత్ పరోక్ష వ్యాఖ్యలు తత్ఫ˜లితమే
కథలూ ఖండనలూ
ఇప్పుడు మనం తాజా చర్చకు వద్దాం. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడైన హెగ్డే వార్ సమకాలికుడు మూరో పంత్ పింగ్లే సంస్మరణ సభలో మోహన్ భగవత్ మాట్లాడుతూ ఆయన 75 ఏళ్ల తర్వాత పదవుల్లో ఉండరాదని సూత్రానికి గట్టిగా కట్టుబడ్డారని చెప్పారు.75 ఏళ్ల వ్యక్తికి ఒక శాలువా ఇచ్చి సత్కరిస్తే ఇక మీరు గౌరవంగా తప్పుకోమని అర్థం చేసుకోవాలని చమత్కరించారు. మోహన్ భగవత్ మాటలను ప్రధానమంత్రికి అన్వయించినదిగా చాలామీడియా సంస్థలు వ్యాఖ్యానించాయిు. నిజంగా అదే చిత్తశుద్ధితో చెప్పాలనుకుంటే మోడీకన్నా వారం ముందే ఆయన దిగిపోవాలి. మరి తన గురించేనా ఎందుకు చెప్పుకోలేదు? మీడియాలో వ్యాఖ్యల తర్వాత మళ్లీ అదే దేవేంద్ర ఫడ్నవిస్ మోడీనే ప్రధాని పదవిలో కొనసాగుతారని చెబుతున్నారు.మోడీ స్వయంగా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ ఆపరేషన్ సిందూర్‌కు బీహార్ స్ఫూర్తి నిచ్చిందని చెప్పడం చూస్తే అంతా రాజకీయమేనని అర్థమయిపోతుంది. దేశ భద్రతకు సంబంధించిన అంశం కూడా తన ఎన్నికల ప్రచారంతో ముడి పెట్టడం బీజేపీకే చెల్లింది. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చినా 2015, 2020 రెండుసార్లు బీహార్ ప్రజలు జేడీయూ- ఆర్‌జేడీ కూటమినే గెలిపించారు. రెండుసార్లు కూడా నితీష్ కుమార్ రాజకీయంగా రంగు మార్చి బీజేపీకి అవకాశం ఇచ్చారు. కేవలం మోడీ ఎత్తులుపై ఎత్తులే విజయం గ్యారెంటీ చేయవని చెప్పడానికి బీహార్‌కన్నా నిదర్శనం ఉండదు. అలాంటి బీహార్‌లో మూడోసారి ఎన్నికల పోరాటం ముందు ఒక కృత్రిమ వాతావరణ కోసమే ఈ 75 ఏళ్ల పంచాయితీనా?
అద్యక్ష ఎన్నిక కోసమా?
కాంగ్రెస్‌లో వలే తాము బయటికి పోట్లాడుకోమని బీజేపీ వారు చెప్పుకునే గొప్ప. కానీ సంఫ్‌ు పరివార్‌లో విభేదాలులేవని కాదు. ముందు చెప్పుకున్న అద్వానీ, వాజ్‌పేయి నుంచి ఇప్పటి అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీ వరకు వ్యక్తిగత వివాదాలూ, పదవీ పోరాటాలు చాలా ఉన్నాయి. గత రెండేండ్లుగా బీజేపీకి పూర్తిస్థాయి అధ్యక్ష ఎన్నిక జరిగింది లేదంటే అదే కారణం. ఏవో ఎన్నికలు రాజకీయ కారణాలను చూపించి జేపీ నడ్డానే పొడిగిస్తున్నారు. ప్రధానిగా మోడీ ప్రభ మసకబారిపోయినా పదవీకాలం ముగిసే దాకా కదిలించలేరు. కనుక కనీసం అధ్యక్ష పదవిలోనైనా తమ వారిని కూర్చోబెట్టాలని వివిధ వర్గాలు మల్లగులాలు పడుతున్నాయి. అధ్యక్ష పదవి కోసం వచ్చిన పేర్లు, ఆ తర్వాత మహిళలే ఉంటారన్న ఊహాగానాలు మొత్తం అందులో భాగమే. ఎవరు ఊహించని వ్యక్తి నాయకత్వం చేపడతారని కూడా కొన్ని వర్గాలు చెబుతున్నాయి. చావుకు పెడితే లంకను నీకు అన్నట్టు ప్రధాని రిటైర్మెంట్ చర్చ నడిపించి కనీసం కోరుకున్న అధ్యక్షుడినైనా నియమించుకోవడానికి సంఫ్‌ు పెద్దలు తంటాలు పడుతున్నారన్నమాట. మోడీ జనాకర్షణ పనిచేయడం లేదనేది నిజం. అయినప్పటికీ ఆ మాత్రం ఉన్నవారు ఇక దొరకరని, పైగా మతపరమైన విభజనలు పెరిగిపోయాక మరింత తీవ్రమైన వ్యూహాలను చేపట్టడానికి ఆయన అవసరమని పరివార్ పెద్దలు భావిస్తున్నారని అంటారు. ఆ పైన కార్పొరేట్ ఒత్తిళ్లు. ఈ మొత్తం ప్రహసనం ఎలా పరి సమాప్తం అవుతుందో చూద్దాం. మోడీ శకానికి తిరుగులేదన్నట్టు, దాని ముందు తలవంచాల్సిందే అన్నట్టు కోతలు కోసినవారు,తప్పుడు అంచనాలు వేసినవారు కూడా ఈ మల్లగుల్లాల నుంచి పాఠాలు నేర్చుకుంటారని ఆశించాలి.
తెలకపల్లి రవి
@ 75 ఏండ్ల కథనాల వెనక పాచిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES