Thursday, September 25, 2025
E-PAPER
Homeజాతీయంరైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌

- Advertisement -

– భారీగా మెడికల్‌ సీట్ల పెంపు
– ఎన్నికల వేళ బీహార్‌కు వరాలు
– కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులకు దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ ఉద్యోగులకు కేంద్రం 78 రోజుల బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 10.91 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఈ బోనస్‌ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,866 కోట్లు కేటాయించింది. బుధవారం నాడిక్కడ ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం భేటీ అయింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. రైల్వే నాన్‌ గెజిటెడ్‌ గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ (లెవెల్‌ 1 స్టాఫ్‌) ఉద్యోగులకు బోనస్‌ వర్తించనుంది. అలాగే, రైల్వే ప్రొడక్షన్‌ యూనిట్లు, రైల్వే వర్క్‌షాపులు, ఇతర సహాయ విభాగాలలో పనిచేసే 10,91,146 ఉద్యోగులకూ ఈ బోనస్‌ అందనుంది.

భారీగా మెడికల్‌ సీట్ల పెంపు
దేశంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌ వైద్య విద్య సీట్లు భారీ పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐదు వేల పీజీ, 5,023 ఎంబీబీఎస్‌ సీట్లను పెంచడానికి, ప్రస్తుత ప్రభుత్వ వైద్య కళాశాలల అప్‌గ్రేడ్‌ కోసం సెంట్రల్‌ స్పాన్సర్డ్‌ స్కీమ్‌ (సీఎస్‌ఎస్‌) విస్తరణకు ఆమోదం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌ సీట్లు 1,18,190కి, పీజీ సీట్లు 74,306కి చేరుకుంటాయి. మొత్తం రూ.15,034.50 కోట్ల బడ్జెట్‌ (2025-26 నుంచి 2028-29 వరకు)తో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఇందులో కేంద్రం వాటా రూ.10,303.20 కోట్లు కాగా.. రాష్ట్రాల వాటా రూ.4,731.30 కోట్లు ఉంది. డిమాండ్‌కు తగ్గట్టు సీట్లు పెంచడం అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మార్పుల అమలుకు మార్గదర్శకాలు వెంటనే జారీ చేస్తుంది.

రూ. 2,277.397 కోట్లతో ‘సామర్థ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి’ పథకం
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండిస్టియల్‌ రీసెర్చ్‌ (డీఎస్‌ఐఆర్‌), కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండిస్టీయల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)లోని ‘సామ ర్థ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి’ పథకాన్ని 15వ ఆర్థిక సంఘం కాలా నికి గాను 2021-22 నుంచి 2025-26 వరకు మొత్తం వ్యయం రూ. 2,277.397 కోట్లతో చేపట్టేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని సీఎస్‌ఐఆర్‌ అమలు చేస్తుంది. అన్ని పరిశోధన-అభివృద్ధి సంస్థలు, జాతీయ ప్రయోగశాలలు, జాతీయ ప్రాధాన్యమున్న సంస్థలు, ఉన్నత స్థాయి సంస్థలు, దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు దీని పరిధిలోకి వస్తాయి.

సముద్ర రంగం అభివృద్ధికి రూ.69,725 కోట్లు
నౌకా నిర్మాణం, నౌకా వాణిజ్య రంగాల పునరుజ్జీవనం కోసం రూ. 69,725 కోట్ల సమగ్ర ప్యాకేజీని కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. ఈ ప్యాకేజీ కింద మొత్తం రూ.24,736 కోట్ల కార్పస్‌తో నౌకా నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించే పథకం (ఎస్‌బీఎఫ్‌ఏఎస్‌) గడువును 2036 మార్చి 31 వరకు పొడిగించారు. దేశంలో నౌకా నిర్మాణాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకంలో రూ. 4,001 కోట్ల కేటాయింపు గల షిప్‌బ్రేకింగ్‌ క్రెడిట్‌ నోట్‌ భాగంగా ఉంది. అన్ని కార్యక్రమాల అమలును పర్యవేక్షించడం కోసం ఒక జాతీయ నౌకా నిర్మాణ మిషన్‌నూ ఏర్పాటు చేస్తారు. రూ. 25,000 కోట్ల కార్పస్‌తో ఈ రంగానికి దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అందించేందుకు మారిటైమ్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఎన్‌డీఎఫ్‌) ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 49 శాతం భాగస్వామ్యంతో రూ. 20,000 కోట్ల మారిటైమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, రుణాల ప్రభావ వ్యయాన్ని తగ్గించడానికి, ప్రాజెక్ట్‌ బ్యాంకింగ్‌ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రూ 5,000 కోట్ల వడ్డీ ప్రోత్సాహక నిధి దీనిలో భాగంగా ఉన్నాయి. దేశీయ నౌకా నిర్మాణ వార్షిక సామర్థ్యాన్ని స్థూలంగా 4.5 మిలియన్‌ టన్నులకు విస్తరించడం, మెగా నౌకా నిర్మాణ క్లస్టర్లకు మద్దతు ఇవ్వడం, మౌలిక సదుపాయాల విస్తరణ, ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీకి అనుబంధంగా దేశ నౌకా సాంకేతికత కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, నౌకా నిర్మాణ ప్రాజెక్టులకు బీమా మద్దతు సహా రిస్క్‌ కవరేజీని అందించడం లక్ష్యంగా రూ. 19,989 కోట్ల బడ్జెట్‌ వ్యయంతో నౌకా నిర్మాణఅభివృద్ధి పథకాన్ని (ఎస్‌బీడీఎస్‌) అమలు చేస్తారు. ఈ మొత్తం ప్యాకేజీ.. స్థూలంగా 4.5 మిలియన్‌ టన్నుల నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని సాధించడంతో పాటు దాదాపు 30 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని, భారత నౌకా వాణిజ్య రంగంలోకి సుమారు రూ.4.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.

బీహార్‌లో రూ.3,822 కోట్లతో నాలుగు లైన్లు
సాహెబ్‌ గంజ్‌- బెట్టయ్య ఎన్‌ హెచ్‌ 139 నాలుగు లైన్ల రహదారి 79 కిలో మీటర్ల అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. రెండేండ్లలో పూర్తి కానున్న ఈ నిర్మాణానికి కేంద్రం రూ.3,822 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే, భక్తియార్‌ పూర్‌-రాజ్‌ గిర్‌- తలయ రైల్వే లైన్‌ డబ్లింగ్‌కి కూడా క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. 104 కిలో మీటర్ల మేర రైల్వే లైన్‌ డబ్లింగ్‌ కోసం కేంద్రం రూ.2,192 కోట్లు ఖర్చుపెట్టనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -