భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం విద్యార్థి దశలోనే చదువులకు స్వస్తి చెప్పి పోరుబాట పట్టిన చెర్వు అన్నారం వీరులు పసునూరి వెంకట్ రెడ్డి, ముస్కు వెంకట్ రెడ్డి 1948 ఏప్రిల్ 12న రజాకార్ల దమనానికి బలై అమరులయ్యారు. పెడరెక్కలు విరిచి చెట్టుకి కట్టి కాల్చి చంపిన ఆ క్రూర ఘటనకు నేటికి 78 ఏళ్లు. వారి త్యాగజ్యోతి ఆరలేదు. వారు రక్తం చిందించిన నేల నేడు పచ్చని పొలాల మధ్య అమరవీరుల స్మారక స్థూపంగా నిలిచి ప్రతి ఏడాది జాతరగా జరుగుతుంది.
ఈ అమరవీరులకు చెర్వు అన్నారంతో ఎలాంటి రక్త సంబంధం లేదు, వారసత్వ పేచీ అంతకంటే లేదు. కానీ వారిని అనుసంధానించింది కేవలం ఎర్ర జెండా పెనవేసిన విప్లవ బంధం మాత్రమే! సొంత బంధువులనే విస్మరిస్తున్న నేటి స్వార్థపూరిత కాలంలో ప్రజల కోసం ప్రాణాలర్పించిన ఆ మహనీయుల త్యాగాన్ని గౌరవిస్తూ తరతరాలుగా ఈ ప్రాంత ప్రజలు అమరుల త్యాగాన్ని గుండెల్లో దాచుకుని ఘనంగా వర్ధంతి నిర్వహించడం వారి పట్ల ఉన్న అపారమైన గౌరవానికి నిదర్శనం. వ్యక్తులను కాల్చివేయగలిగినా ఆశయాలను చంపలేమని చరిత్ర చెబుతుంటే ప్రజల కోసం ప్రాణాలు అర్పించినవారు ఎప్పటికీ జీవిస్తారనే సత్యానికి పసునూరి, ముస్కు వెంకట్ రెడ్డి ల అమరత్వం చిరస్మరణీయ సాక్ష్యంగా నిలుస్తోంది.
పసునూరి వెంకట్ రెడ్డి కేతేపల్లి మండలం కాసనగోడు గ్రామానికి చెందినవాడు. ముస్కు వెంకట్ రెడ్డి నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందినవాడు. గ్రామాలు వేరైనా లక్ష్యం ఒక్కటే. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య సారధ్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పిలుపును అందుకొని ప్రజల విముక్తి కోసం, రజాకార్లను తరిమికొట్టడం కోసం ఎర్రజెండా నీడలో ఇద్దరూ ఏకమయ్యారు. అనేక గ్రామాలను విముక్తి చేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డారు. అణగారిన కుటుంబాల్లో వెలుగు దీపాలుగా నిలిచారు. వారి త్యాగం చిరస్మరణీయం, వెలకట్టలేనిది. వారిని చంపగలిగినా వారి ఆశయాలను చంపలేకపోయారు. ప్రజల కోసం చనిపోయిన వారు ఎల్లకాలం జీవిస్తారనే నగ సత్యాన్ని వారి జీవితం నిరూపించింది.
1946 సెప్టెంబర్ 11న ప్రారంభమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నకిరేకల్ ప్రాంతం కీలక కేంద్రంగా నిలిచింది. మంగళపల్లి, కాసనగోడు, బొప్పారం, నోముల, కొప్పోలు, తుంగతుర్తి తదితర గ్రామాలకు చెందిన యువకులు దళాల్లో చేరి పీడిత, తాడిత ప్రజల విముక్తి కోసం పోరాటం సాగించారు. సుమారు 150 మంది వివిధ దళాల్లో పనిచేసి రజాకార్లకు ఎదురు నిలబడ్డారు. రజాకార్ల కాల్పుల్లో 58 మంది అమరులయ్యారు. గ్రామాలు ఉద్యమ కేంద్రాలుగా మారి ప్రజలు భూస్వామ్యానికి, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడారు. ఎర్రజెండా చైతన్యంతో ప్రజలు ఒకటై నిజాం నిరంకుశ పాలనకు సవాల్ విసిరారు.

సంఘటిత విద్యార్థి నిర్మాణంలో పీ.వీ ఒకరు. విద్యార్థి సంఘాన్ని జిల్లాలో విస్తరించడానికి కీలకపాత్ర పోషించాడు. విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రజా పోరాటాల వరకు పసునూరి వెంకట్ రెడ్డి కీలక పాత్ర వహించాడు. ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా విద్యార్థి నాయకుడిగా ఎదిగి నల్లగొండ జిల్లాలో చైతన్యం నింపాడు. జెండా సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యాడు. అనంతరం అజ్ఞాత జీవితం గడుపుతూ ప్రజా పోరాటాలను కొనసాగించాడు. ఆయన ధైర్యసాహసాలు రజాకార్లకు భయానకంగా మారాయి. ముస్కు వెంకట్ రెడ్డి కూడా ప్రజల మధ్య తిరుగుతూ ఉద్యమాన్ని బలోపేతం చేశాడు. ఇద్దరూ కలసి అనేక గ్రామాల్లో ప్రజలను సంఘటితం చేసి దొరల దమనానికి చెక్ పెట్టారు.
వీరులను ఎదురుగా ఢకొీనే ధైర్యం లేక శత్రువులు కుట్రలకు దిగారు. ఇద్దరు నమ్మదగిన వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో రజాకార్లు చెర్వు అన్నారం గ్రామంపై దాడి చేశారు. పసునూరి వెంకట్ రెడ్డి, ముస్కు వెంకట్ రెడ్డి లను పట్టుకుని వీధుల వెంట ఈడ్చుకుంటూ ఊరి చివరనున్న వేపచెట్టుకు కట్టేసి పెడరెక్కలు విరిచి కాల్చిచంపారు. వీరితోపాటు చుట్టుపక్క గ్రామాలలో రాచకొండ ఎల్లస్వామి, గండమల్ల నరసింహ, మిట్ట లింగారెడ్డిని చిత్రహింసలు పెట్టి కాల్చిచంపారు. అప్పటికి పసునూరి, ముస్కు వెంకట్ రెడ్డిల వయస్సు ఇరవై సంవత్సరాల లోపే. రజాకార్ల తూటాలు వారి శరీరాలను ఛేదించినా వారి ఆశయాలను మాత్రం ఆర్పలేకపోయాయి. ఆ రక్తధారలు చెర్వు అన్నారం నేలను పునీతం చేశాయి. వారు స్ఫూర్తితో అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువు అయ్యింది.
అనేక మంది కార్యకర్తలు నాయకులు ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. అన్నారం ప్రజలు ఎర్రజెండా అండదండలు అందించారు అనేకమంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు ప్రజల పక్షాన నిలబడి. పాలకుల విధానాలను ఎండగడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం గళం విప్పారు. అభివద్ధికి అడుగులు వేశారు. ప్రజల బానిస సంకెళ్లు తెంచి వెట్టిచాకిరి నిర్మూలన కోసం ప్రాణాలు అర్పించిన వీరుల జ్ఞాపకార్థం చెర్వు అన్నారం గ్రామంలో స్మారక స్థూపం నిర్మించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వర్ధంతి సందర్భంగా ప్రజలు భారీగా తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు. ప్రత్యేక పండుగలు మర్చిపోయినా అమరుల వర్ధంతిని మాత్రం జాతరగా నిర్వహించడం ఈ ప్రాంత ప్రజల ప్రత్యేకతగా మారింది. పాటలు, నినాదాలు, జెండాలతో గ్రామం మొత్తం చైతన్యంతో మార్మోగుతోంది. ఇది కేవలం జ్ఞాపకం కాదు, పోరాట స్ఫూర్తికి ప్రతీక. ఈ స్థూపం ఇటీవల కాలంలో కొంత శిథిలావస్థలోకి చేరింది. దీన్ని పునర్నిర్మాణం కోసం ఆ ఊరి ప్రజలు, ఎర్రజెండా ప్రయత్నిస్తుంది. పూర్వ వైభవం తీసుకోవడానికి రావడానికి అడుగులు వేస్తుంది.
పసునూరి ముసుకు వెంకట్ రెడ్డి చరిత్రను పుచ్చలపల్లి సుందరయ్య రాసిన వీర తెలంగాణ విప్లవ పోరాట గుణపాఠాలు, వీర తెలంగాణ మాది, వీర తెలంగాణ పోరాట గాథలు, సై సై ఓ నల్గొండ వీరుడా, సిపిఎం నకిరేకల్ 50 వసంతాల స్వర్ణోత్సవ పుస్తకాల్లో చరిత్రను లిఖించబడ్డాయి. గతంలో అనేకసార్లు చెర్వు అన్నారం ఘనంగా అమరవీరుల స్మారక సభను నిర్వహించారు. ఈ సభలకు పార్టీ సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, పుణ్యవతి, వీర వనిత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, మరెందరో రాష్ట్ర జిల్లా నాయకులు హాజరయ్యారు. చెర్వు అన్నారం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మందుల విప్లవ కుమార్ సారథ్యంలో రూపొందించిన అమరవీరుల స్మతి గీతాలను ఆదర్శ నేత నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి హాస్పటల్‌లో వైద్యం పొందుతూ ఫోన్ ద్వారా మల్లు స్వరాజ్యం ప్రత్యక్షంగా పాటల క్యాసెట్ విడుదల చేశారు.

నేటికీ ఆ గీతాలు ప్రతిధ్వనిలా వినిపిస్తూనే ఉంటాయి. రక్తాక్షర సంతకాలతో రాసిన ఈ సాయుధ సంగ్రామ చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన ఈ యువ వీరుల త్యాగం నేటి తరానికి మార్గదర్శకం. మత విద్వేషాలు, కుల వివక్ష, గంజాయి మత్తు, అవినీతి, మహిళపై దాడులు వంటి రాజకీయాలు సమాజాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్న ఈ కాలంలో వారి ఆశయాలను కొనసాగించడం అత్యవసరం. ప్రజల హక్కులను కాపాడడం, అన్యాయాలకు ఎదురు నిలబడడం, బలహీన వర్గాలకు అండగా నిలవడం, సమ సమాజ నిర్మాణం కోసం బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, సమస్త ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడడంవారివారసత్వాన్ని కొనసాగించడం అవుతుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితం కావడం కూడా ఆ అమరుల ఆశయాలకు నిజమైన నివాళి. ఇరవై సంవత్సరాల లోపే ప్రాణాలు అర్పించిన పసునూరి వెంకట్ రెడ్డి, ముస్కు వెంకట్ రెడ్డి, రాచకొండ ఎల్లస్వామి, గండమల్ల నరసింహ, మిట్ట లింగారెడ్డి త్యాగం చరిత్రలో చెరగని ముద్రగా నిలిచింది. వారిని శరీరంగా అంతమొందించినా వారి ఆశయాలను మాత్రం ఎవరూ చెరపలేకపోయారు. చెర్వు అన్నారం వేపచెట్టు కింద కారిన రక్తం కేవలం గతం కాదు… అది పోరాట పిలుపు. ఆ రక్తాక్షర సంతకాలు చెరిగిపోవు. ఆ త్యాగం మరువలేం. ప్రజల కోసం చనిపోయిన వారు ఎల్లకాలం జీవిస్తారనే నగ్న సత్యాన్ని ఈ నేల తరతరాలకు చెబుతూనే ఉంటుంది. వారి జ్యోతి వెలుగుతూ ఉండాలి… వారి పోరాటం ముందుకు సాగాలి… వారి ఆశయాలతో సమ సమాజం నిర్మించడమే వారికి ఇచ్చే నిజమైన జోహార్లు.
- గడగోజు రవీంద్ర చారి, 9848772232



