నవతెలంగాణ-బోడుప్పల్ : పల్లవి మోడల్ స్కూల్ బోడుప్పల్ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విశిష్టంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టూడెంట్ ట్రిబ్ వ్యవస్థాపకుడు,సీఈవో చరణ్ లక్కరాజు, పాఠశాల ప్రిన్సిపల్ తనూజ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో వారంరోజుల పాటు వివిధ పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో దేశభక్తి చైతన్యాన్ని నింపారు. చిన్నారులు జాతీయ నాయకుల వేషధారణ, ర్యాలీలు నిర్వహించి దేశభక్తి సందేశాన్ని అందించారు.
“హర్ ఘర్ తిరంగ” కార్యక్రమం లో భాగంగా పాఠశాల డైరెక్టర్ సుశీల్ కుమార్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ చేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులు దేశభక్తిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. మానవహారంతో రూపొందించిన భారత దేశ చిత్రపటం ఆకట్టుకోగా, ఏరియల్ యోగా ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధులను చేసింది. పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తనూజ మాట్లాడుతూ, “విద్యార్థులందరూ దేశం గర్వించే పౌరులుగా ఎదిగి, దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలి” అని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథి శ్రీ చరణ్ లక్కరాజు మాట్లాడుతూ, “బాగా చదివి విద్యావంతులై, సమాజం గుర్తించే పౌరులుగా మీరందరూ మారాలి. 100వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఏ రూపంలో చూడాలని అనుకుంటున్నామో, ఆ లక్ష్యం దిశగా ఇప్పటినుంచే ప్రయాణం చేయాలి” అని విద్యార్థులను ప్రేరేపించారు. పల్లవి మోడల్ స్కూల్ ఆవరణ అంతా దేశభక్తి నినాదాలతో మార్మోగి, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి.