ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
పంచాయతీ కార్యదర్శి సంతకాలు ఫోర్జరీ చేసి కోర్టులో నేరస్తులకు జామీను ఇప్పించడంతో పాటు కోర్టులో జప్తు చేయబడిన వస్తువులను విడిపించేందుకు అవసరమైన ష్యూరిటీ పత్రాలతో మోసగించిన కేసులో ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు మండలం కొత్తూరు పంచాయతీ కారోబారితో పాటు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రధాన సూత్రదారి కారోబారి తలమడుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కాటిపెల్లి అభిలాష్‌రెడ్డితో పాటు ఆయనకు సహకరించిన ఖుర్షీద్‌నగర్‌కు చెందిన సయ్యద్ ఇర్ఫాన్, గంటి సత్నా, మద్దెల అశోక్, రామిరెడ్డి, కొకటారు అశోక్, షాహిద్, ఎండీ అమీర్‌ను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఈమేరకు శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ నాగరాజుతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు.
నకిలీ ష్యూరిటీలను ఉపయోగించి, లబ్ది పొందిన, బ్రోకరిజం చేసిన 17 మందిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. తలమడుగు మండలం కొత్తూరు గ్రామపంచాయతీ కార్యదర్శి గిరవేరి రాహుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈ దర్యాప్తు చేపట్టారు. నిందితులు అభిలాష్‌రెడ్డి సయ్యద్ ఇర్ఫాన్‌తో కలిసి కార్యదర్శి సంతకాలను ఫోర్జరీ చేసి పలువురికి కోర్టు బెయిల్, ఆస్తుల విడుదల కోసం ష్యూరిటీ పత్రాలను సృష్టించడంతో పాటు నకిలీ గృహ విలువ పత్రాలు, పన్ను రసీదులు సృష్టించి బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారని తెలిపారు. కార్యదర్శి అందించిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు. తెలియని వారికి, పెద్ద పెద్ద నేరాలు చేసే వారికి, బ్రోకర్ల ద్వారా వచ్చే వారికి ప్రభుత్వ అధికారులలు ష్యూరిటీలు ఇచ్చి మోసపోవద్దని తెలిపారు. ష్యూరిటీ ఇచ్చిన నిందితులు పారిపోయినట్లయితే మీ నుంచి డబ్బులను, ఆస్తిపత్రాలను జప్తు చేయబడుతుందని, కట్టని పక్షంలో ఆస్తుల స్వాధీనం లేదా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.