Wednesday, October 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధం

80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధం

- Advertisement -

– కేంద్ర ప్రభుత్వం సహకరించాలి
– కేంద్రానికి మంత్రి ఉత్తమ్‌ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉన్నామనీ, కేంద్రం తగిన సహకారం ఇవ్వాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఆహారం, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి లేఖ రాశారు. రికార్డుస్థాయిలో సేకరణ లక్ష్యాలకు అనుగుణంగా డెలివరీ నిబంధన లు సడలించాలని, అదనపు నిల్వ, రవాణా సౌకర్యాలను కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 45-50 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నటి వరి, 30-35 లక్షల మెట్రిక్‌ టన్నుల ముతక ధాన్యం సేకరించనున్నట్టు ఆయన వెల్లడించారు. క్వింటాలు ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.2,389 నిర్ణయం మేరకు 80 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణకు దాదాపు రూ.20 వేల కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు. బోనస్‌ చెల్లింపులు, రవాణాతో కలిసి ఖర్చు రూ.24 వేల నుంచి రూ.26 వేల కోట్ల మధ్య పెరుగుతుందని వివరించారు.

కస్టమ్‌ మిల్డ్‌ రైస్‌ (సీఎంఆర్‌) డెలివరీ గడువును ఈ ఏడాది నవంబర్‌ 12 వరకు పొడిగిస్తూ, పార్బాయిల్డ్‌ రైస్‌గా మాత్రమే సరఫరాను తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుపై ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ముడి బియ్యం మార్పిడికి ఖరీఫ్‌ వరి మరింత అనుకూలంగా ఉంటుందనీ. అందుబాటులో ఉన్న స్టాక్‌లో, 7.80 లక్షల మెట్రిక్‌ టన్నులు ముడి బియ్యం మిల్లర్ల వద్ద ఉన్నాయి. అయితే 1.67 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి (1.13 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యానికి సమానం) బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్ల వద్ద ఉంది. లభ్యతను బట్టి ముడి, బాయిల్డ్‌ రైస్‌ రెండింటినీ డెలివరీ చేయడానికి అనుమతివ్వాలనీ, బాయిల్డ్‌ రైస్‌ లక్ష్యాన్ని రబీ సీజన్‌కు మార్చాలని ఉత్తమ్‌ కోరారు.

సెప్టెంబర్‌ చివరి నాటికి ఖరీఫ్‌ 2024-25 నుంచి 5.44 లక్షల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌, రబీ 2024-25 నుండి 14.92 లక్షల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ పంపిణీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. దీని ఫలితంగా మిల్లర్లు కార్యకలాపాలను నిలిపివేయగా, పని లేకపోవడంతో కార్మికులు రైస్‌ మిల్లులను వదిలి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పారు.
రాష్ట్రంలోని ఎఫ్‌సీఐల నిల్వ సామర్థ్యం 22.61 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, 21.72 లక్షల మెట్రిక్‌ టన్నులు ఇప్పటికే నిండి ఉన్నాయని, కేవలం 0.89 లక్షల మెట్రిక్‌ టన్నులకు మాత్రమే ఖాళీగా ఉన్నాయని ఉత్తమ్‌ తెలిపారు. నెలకు కనీసం 300 ప్రత్యేక రేక్‌లను (రైళ్లు) ఇవ్వాలని ఆయన సూచిం చారు. అదనపు నిల్వ స్థలాన్ని లీజుకు ఇవ్వమని మేము ఎఫ్‌సీఐ కోరారు. 36 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం (53.73 లక్షల మెట్రిక్‌ టన్నుల వరికి సమానం) సేకరణకు ఆమోదం తెలిపారనీ, మరో 10 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని కోరారు. 80 లక్షల మెట్రిక్‌ టన్నుల వరికి సమానమైన 53.60 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించాలని, లేకుంటే లక్షలాది మంది రైతులు ధాన్యం అమ్మకాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారని మంత్రి ఉత్తమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గత రబీ సీజన్‌లో తెలంగాణ 74 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించగా, కేంద్రం 53 లక్షల మెట్రిక్‌ టన్నులను మాత్రమే ఆమోదించిందని ఉత్తమ్‌ గుర్తుచేశారు. ఇప్పటికే సేకరించిన రబీ పంట నుండి మరో 10 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకోవాలనీ, సేకరణ గడువును అక్టోబర్‌ 31 నుంచి 2026 జనవరి 31 వరకు పొడిగించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -