పాండియ రాజుల కాలం చరిత్ర పదిలపర్చాలి
పురాతన ఆలయ సందర్శనలో వెల్లడి
నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఈరట్వానిపల్లి – నానాపురం సరిహద్దులో ఉన్న 800 ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయం, శివాలయం, హనుమాన్ దేవాలయాలు శిధిలావస్థకు చేరాయి. పాండియ రాజుల కాలం నాటి ఈ పురాతన ఆలయాలు తమ వైభవాన్ని కోల్పోతుండటంతో వాటిని పునర్నిర్మాణం చేసి పునర్‌ప్రతిష్ట చేయాలని భక్తులు నిర్ణయించారు.
ఈ నెల 21న గ్రామానికి చెందిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పురోహితులు శ్రీ రంగ పాణి సీతారామాచార్యులు, భాగ్యనగర మూసాపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ రఘునాథ ఆచార్యులు, విజయవాడకు చెందిన సాధు సత్పురుషులు శ్రీ శ్రీనివాస స్వామి వేదగురు పండితులు ఆలయాన్ని సందర్శించి పూర్తిగా పరిశీలించారు.
“ఆలయాన్ని అభివృద్ధి చేయడం ప్రతి ఒక్కరి ధర్మం. ప్రభుత్వ సహకారం, గ్రామస్థుల ఏకతా ఉంటే పాండియ రాజుల గౌరవం నిలుస్తుంది. పునర్‌ప్రతిష్ట చేసి వచ్చే శ్రీరామనవమి వరకు ఈ ఆలయంలో కల్యాణం జరిగేలా చర్యలు తీసుకుంటాం,” అని వారు అన్నారు.
గ్రామంలో అర్చక పురోహితులు మారోజు ఉమాపతి ఆచార్యులు, బాణాల రామాచార్యులు గ్రామస్థులతో కలిసి అభివృద్ధి కార్యాచరణపై చర్చించారు. మాజీ సర్పంచ్ జక్కుల లింగమయ్య, కేశముని రామచంద్రయ్య, కేతావత్ పూర్వనాయక్, వరికుప్పల తిరుపతయ్య, కేతావత్ బాలు నాయక్, జక్కుల చంద్రమౌళి, గుండె ముని రాములు, కేశముని నరసింహా, కేతావత్ శక్రియ నాయక్ తదితరులు ఈ సందర్శనలో పాల్గొన్నారు.
ప్రభుత్వ సహకారం అత్యవసరం: మాజీ సర్పంచ్ జక్కుల లింగమయ్య
“గ్రామంలో ఉన్న ఈ పురాతన ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అవసరం. ఆలయ చరిత్రను గుర్తించి నిధులు మంజూరు చేసి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలి. 800 ఏళ్ల చరిత్రను రక్షించేందుకు ప్రభుత్వం, గ్రామస్థులు కలసి కృషి చేయాలి,” అని అన్నారు.