Sunday, May 25, 2025
Homeరాష్ట్రీయంపాలిసెట్‌లో 83,364 మంది ఉత్తీర్ణత

పాలిసెట్‌లో 83,364 మంది ఉత్తీర్ణత

- Advertisement -

– సూర్యాపేటకు చెందిన శ్రీజ టాపర్‌
– రెండు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల మంజూరు
– ఉపాధి అవకాశాలు పెరిగేలా కొత్త కోర్సులు : సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పాలిటెక్నిక్‌, డిప్లొమా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్‌-2025 రాతపరీక్ష ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈనెల 13న పాలిసెట్‌ రాతపరీక్షను నిర్వహించారు. 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, వారిలో 98,858 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 83,364 (84.33 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 53,085 మంది బాలురు పరీక్ష రాయగా, 42,836 (80.69 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 45,773 మంది బాలికలు పరీక్ష రాస్తే 40,528 (88.54 శాతం) మంది అర్హత సాధించారు. 98,858 మంది పరీక్ష రాయగా ఎంపీసీ విభాగంలో 80,949 (81.88 శాతం) మంది, ఎంబైపీసీ విభాగంలో 83,364 (84.33 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. పాలిసెట్‌లో 120 మార్కులకు 30 శాతం అంటే 36 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత పొందుతారు. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు ఉత్తీర్ణులు కావాలంటే ఒక మార్కు సాధించాలి. 18,039 మంది ఎస్సీ అభ్యర్థులకుగాను 18,037 మంది, 7,459 మంది ఎస్టీ అభ్యర్థులందరూ ఉత్తీర్ణత సాధించారు.
పాలిటెక్నిక్‌ కాలేజీలను
ఏటీసీలుగా మార్చే ప్రతిపాదన ఉన్నది : శ్రీదేవసన
ఈ సందర్భంగా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసముద్రం (మహబూబాబాద్‌ జిల్లా), పటాన్‌చెరు (సంగారెడ్డి జిల్లా)లో రెండు కొత్త పాలిటెక్నిక్‌ కాలేజీలు మంజూరయ్యాయని వివరించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల సంఖ్య 59కి చేరిందన్నారు. ఇంజినీరింగ్‌ తరహాలో పాలిటెక్నిక్‌లోనూ ఎమర్జింగ్‌ టెక్నాలజీ కోర్సులను ప్రవేశపెడుతున్నామని వివరించారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పాలిటెక్నిక్‌ సీట్లకు సంబంధించి ఏఐసీటీఈ అనుమతి ఇవ్వగానే ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. వచ్చేనెలాఖరు నాటికి రావొచ్చని చెప్పారు. ఇటీవల సీఐఐ సమావేశం జరిగిందనీ, ఇంజినీరింగ్‌ కంటే పాలిటెక్నిక్‌ విద్యార్థులకే మంచి నైపుణ్యం ఉంటుందనీ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారని గుర్తు చేశారు. సీఐఐతో మాట్లాడి పరిశ్రమలకు ఏం కావాలో విద్యార్థులకు నేర్పించడానికి పాలిటెక్నిక్‌ అధ్యాపకులకు ఇటీవల శిక్షణ ఇప్పించామని అన్నారు. పాలిటెక్నిక్‌ కాలేజీలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా మార్చే ప్రతిపాదన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి (ఎస్‌బీటీఈటీ) ఇన్‌చార్జీ కార్యదర్శి బి శ్రీనివాస్‌, పరీక్షల నియంత్రణాధికారి, సాంకేతిక విద్యాశాఖ జాయింట్‌ సెక్రెటరీ, షఫియాజ్‌ అక్తర్‌, సాంకేతిక విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జి గిరిబాబు, ఎన్‌ఐసీ ఎస్‌ఐవో జి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -