దిగుబడిలో రాష్ట్రానిది ఆల్‌టైం రికార్డు
72 గంటల్లోపు రైతులకు చెల్లింపులు
మొత్తం ప్రక్రియ పర్యవేక్షణకు బృందాలు
సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సమన్వయం చేసుకోవాలి :మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో వానాకాలానికి సంబంధించి 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల కోసం 8,342 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోని సచివాలయం నుంచి ఆయన వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రం ధాన్యం దిగుబడిలో ఆల్‌టైం రికార్డు సాధించిందని చెప్పారు. 148.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. రూ.23 వేల కోట్లతో కొనుగోళ్లు చేస్తున్నామనీ, రైతులకు కొనుగోలు ప్రక్రియ మొదలయ్యాక 48 గంటల నుంచి 72 గంటల్లోపు చెల్లింపులు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ మొత్తం ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా జిల్లా కేంద్రాల నుంచి కొనుగోలు కేంద్రాల వరకు పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తలెత్తే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1800-425-00333/1967కు కాల్ చేయాలని రైతులకు సూచించారు.
దేశంలోని 29 రాష్ట్రాల్లో, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంత దిగుబడి రాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతోనే అత్యధిక ఉత్పత్తి సాధ్యమైందని చెప్పారు. కేంద్రాల వద్ద రైతులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం కూడా సరికొత్త రికార్డ్ అవుతుందని మంత్రి చెప్పారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కొనుగోళ్ల కోసం రూ.22 వేల నుంచి రూ.23 వేల కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సన్నాలు, 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకాలుంటాయని వెల్లడించారు. రాష్ట్రంలో 66.8 లక్షల ఎకరాల్లో ధాన్యం ఉత్పత్తి అయ్యిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మొత్తం 8,342 కొనుగోలు కేంద్రాలుండగా అందులో 4,259 కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా, 3,517 ఐకేపీ ద్వారా, 566 ఇతర సంస్థల ద్వారా ఉన్నాయని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖాధికారులు సమన్వయం చేసుకుని పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేలా ముందుగానే రవాణా వసతి ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ధాన్యం తాలుకా వివరాలు నమోదు అయిన 48 గంటల్లో చెల్లింపులు జరిపేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని కోరారు. మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్‌ను అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, నల్లగొండ జిల్లాలో 1,205 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు మంత్రి వెల్లడించారు. కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించకుండా చర్యలు చేపట్టడంతో పాటు కొనుగోలుకు సంబంధించిన అన్ని పరికరాలు సమకూర్చుకోవాలని ఆయన ఆదేశించారు. అధికారుల సమన్వయంతో గడిచిన ఎండాకాలం ధాన్యం కొనుగోళ్లలో మంచి ఫలితాలు సాధించారనీ, ఆ అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
కేంద్రాల వద్ద అత్యవసరం అనిపిస్తే అదనపు ఖర్చులకు వెనుకడుగు వేయకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. సమయానికి చెల్లింపులు జరిపేందుకు వీలుగా తూకం నుంచి డేటా ఎంట్రీ వరకు సమయపాలన పాటించాలన్నారు.వాతావరణ మార్పులు, వర్ష సూచనలను పౌర సరఫరాల అధికారులు ఎప్పటి కప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షం వస్తే ధాన్యం చెడిపోకుండా ఉండేందుకుగాను టార్ఫాలిన్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తనతో పాటు పౌర సరఫరాల శాఖా కమిషనర్‌ను సంప్రదించాలని సూచించారు. 24 గంటలు తాను అందుబాటులో ఉంటానని, ఇబ్బందులు తలెత్తితే తనకు ఫోన్ చేయాలని అన్నారు.
సమన్వయం చేసుకోవాలి : మంత్రి తుమ్మల
ప్రస్తుత వానాకాలంలో ముందెన్నడూ లేని రీతిలో ధాన్యం దిగుబడి వచ్చిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ, సహకార శాఖలు సమన్వయం చేసుకొని క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రత్యేక దృష్టి సారించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రెండేండ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటేనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, రవాణాశాఖ కమిషనర్ రఘునందన్ రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.