నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మూడవ విడత ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. బుధవారం జిల్లాలోని మండలంలో జరిగిన మూడవ విడుత ఎన్నికల సందర్భంగా 92.56 శాతం పోలింగ్ నమోదు అయ్యిందన్నారు.
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా జరిగేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. మూడవ విడత ఎన్నికల ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ, కార్యదర్శులు, పోలీస్ సిబ్బంది, పోలింగ్ అధికారులు సమన్వయంతో సమర్ధవంతంగా విధులు నిర్వహించారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
మొదటి, రెండవ, మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు, వారి ప్రతినిధులు కానీ ఎవ్వరు విజయోత్సవ ర్యాలీలు, బహిరంగ సమావేశాలు, ఊరేగింపులు జరుపుకోవద్దని,గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలు పూర్తి అయినా కూడా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను జారీ చేసే వరకు కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు.నియమ నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని అన్నారు.



