Wednesday, January 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురెండేండ్లలో 9,572 ఉద్యోగాల భర్తీ

రెండేండ్లలో 9,572 ఉద్యోగాల భర్తీ

- Advertisement -

చివరి దశలో మరో 7,267 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ
త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రతి పోస్టుకు నియామకం : మంత్రి దామోదర
1257 మందికి ల్యాబ్‌ టెక్నీషియన్లుగా నియామక పత్రాలు అందజేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరాక రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో రెండేండ్లలో 9,572 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ఆయన ఇటీవల ల్యాబ్‌ టెక్నీషియన్లుగా ఎంపికైన 1,257 మందికి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులతో కలిసి నియామ కపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరో 7,267 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చివరి దశలో ఉందని తెలిపారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి 2024 సెప్టెంబర్‌ 11న నోటిఫికేషన్‌ విడుదల చేసి 2025 నవంబర్‌ నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేసినట్టు వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తం 23,323 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 1,257 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు. డీఎంఈ పరిధిలో 764, డీపీహెచ్‌లో 300, టీవీవీపీలో 180, ఎంఎన్‌జేలో 13 మందికి పోస్టింగ్స్‌ ఇచ్చినట్టు తెలిపారు. వైద్య వ్యవస్థకు ల్యాబ్‌ టెక్నీషియన్లు కీలకమనీ, వారిచ్చే రిపోర్టులే వైద్యులకు చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి దామోదర గుర్తుచేశారు. ఎన్‌ఏబీఎల్‌ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ల్యాబ్స్‌ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ల్యాబ్‌ టెక్నీషియన్లు తీసుకోవాలని కోరారు.

రెండేండ్లలో సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం 70 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని మంత్రి తెలిపారు. ఇందులో వైద్యారోగ్యశాఖలో 9,572 పోస్టులు భర్తీ చేయగా, మరో 7,267 పోస్టుల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందనీ, ఆర్థికశాఖ అనుమతి కోసం పంపిన 996 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌ వెల్లడిస్తామని తెలిపారు. ఇవే కాకుండా అదనంగా 2,344 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించినట్టు ఆయన వివరించారు. తెలంగాణను ఆరోగ్య రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో పని చేస్తున్నట్టు తెలిపారు. ఉస్మానియా నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచడం, ప్రతి జిల్లాలో ఎన్‌సీడీ క్లినిక్స్‌, క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్లు, ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రి క్లినిక్స్‌, గాంధీ ఆసుపత్రిలో ఉచిత ఐవీఎఫ్‌ సేవలు అందుబాటులోకి తెచ్చామని మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను సెకండరీ హెల్త్‌ కేర్‌గా మార్చబోతున్నట్టు మంత్రి ప్రకటించారు. త్వరలోనే నూతన హెల్త్‌ పాలసీని రూపొందించి, అమలు చేయబోతున్నామని తెలిపారు.

ఉగాది నాటికి సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభం
ఉగాది నాటికి హైదరాబాద్‌ సనత్‌నగర్‌ టిమ్స్‌ హాస్పిటల్‌ను ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”హాస్పిటల్‌ బిల్డింగ్‌ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఎలక్ట్రికల్‌ వర్క్స్‌ కొన్ని ఇంకా చేయాల్సి ఉంది. ఆపరేషన్‌ థియేటర్లు, డయాగస్టిక్స్‌, ఇతర ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటు కూడా చివరి దశలో ఉంది. ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎంఆర్‌ఐ వంటి భారీ యంత్రాల ఫిట్టింగ్‌ పూర్తయింది….” అని తెలిపారు. ఉగాది నాటికి వెయ్యి బెడ్ల ఈ హాస్పిటల్‌లో పేషెంట్లకు అన్ని రకాల వైద్య సేవలు అందుతాయని మంత్రి తెలిపారు. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా సనత్‌నగర్‌ టిమ్స్‌ ఉంటుందని చెప్పారు. ఇక్కడే అవసరమైన పరిశోధన జరుగుతుందని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో అత్యాధునిక ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అన్నిరకాల అవయవమార్పిడి సర్జరీలు చేసేలా అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు అందుబాటులో ఉంటాయన్నారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి ఎలాంటి కొరత ఉండదని మంత్రి దామోదర తెలిపారు.

బస్సు-ఆటోను ఢకొీన్న ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : మంత్రి
వైకుంఠపురం సమీపంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన ఏడుగురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య, జిల్లా వైద్య శాఖాధికారిని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్‌ వెళ్తున్న టీజీఎస్‌ఆర్టీసీ బస్సు ప్లెక్సీలను తరలించే ఆటోను వైకుంఠపురం సమీపంలో ఢకొీట్టింది. ఈ ప్రమాదం లో బస్సులో ప్రయాణిస్తున్న నారాయణఖేడ్‌ మండలం రాయకల్‌ గ్రామానికి చెందిన పూజ (17) తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించే సమయంలో మరణించింది. ఆమె బాసరలోని త్రిబుల్‌ ఐటీలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్‌ చదువుతున్నది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి విచారం వ్యక్తం చేశారు. మరో ప్రయాణికురాలు నిషిత చెయ్యి విరిగిపోవడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డిలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించినట్టు జిల్లా వైద్యశాఖాధికారి మంత్రి వివరిం చారు. స్వల్పంగా గాయపడిన ఇతర ప్రయాణికులకు కూడా అండగా నిలబడాలని మంత్రి ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -