ప్రశాంతంగా ప్రారంభమైన టెన్త్ పరీక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఫస్ట్ లాంగ్వేజ్ రాతపరీక్షను విద్యాశాఖ అధికారులు ప్రశాంతంగా నిర్వహించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు పివి శ్రీహరి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పదవ తరగతి ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు మొదటిరోజు రెగ్యులర్ విద్యార్థులు 5,17,197 మంది దరఖాస్తు చేశారని వివరించారు. వారిలో 5,15,374 (99.65 శాతం) మంది హాజరయ్యారని తెలిపారు.
ఈ పరీక్షకు 1,823 (0.35 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రయివేటు విద్యార్థులు 786 మంది దరఖాస్తు చేయగా, 626 మంది పరీక్షకు హాజరుకాగా, 160 మంది గైర్హాజరయ్యారని వివరించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, ఇతర అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,240 పరీక్షా కేంద్రాలను సందర్శించారని తెలిపారు. మొదటిరోజు మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఒక చీఫ్ సూపరింటెండెంట్ (సీఎస్), ఒక డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ (డీవో), ఒక ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తొలగించి వేరే వారిని నియమించామని తెలిపారు.



