Friday, March 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం99 డేస్‌ యాక్షన్‌ ప్లాన్‌

99 డేస్‌ యాక్షన్‌ ప్లాన్‌

- Advertisement -

‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’ పేరుతో జనంలోకి
నేటి నుంచి పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌ కోసం స్పెషల్‌ డ్రైవ్‌
జూన్‌ రెండో తేదీ వరకు ఒక్కోవారం ఒక్కో రంగంపై ఫోకస్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఈ నెల ఆరో తేదీ నుంచి జూన్‌ రెండో తేదీ వరకు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌తో ప్రజల్లోకి వెళ్లనుంది. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2023 డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6 వరకు, 2025 జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు రెండోసారి ప్రజా పాలన గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారి నుంచి అర్జీలు స్వీకరించటంతో పాటు ప్రజలతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయిలోని సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. అప్పుడు ప్రజల నుంచి వచ్చిన అర్జీలతోనే ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసింది. అక్కడ తీసుకున్న అర్జీల ఆధారంగానే రైతు రుణమాఫీ, రైతు భరోసా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 కు గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, కళ్యాణలక్ష్మి, షాధీ ముబారక్‌, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్‌ కార్డుల జారీ. సన్న బియ్యం పంపిణీ, సన్న వడ్లకు రూ.500 బోనస్‌ పథకాలను అమలు చేసింది.

ఇప్పుడు మూడోసారి ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణకు నడుం బిగించింది. పౌర సేవలు, ప్రజల అవసరాలతో మమేకమై ఉండే అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక కార్యక్రమాలు తల పెట్టింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అయిదు స్థాయిల్లో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతోంది. మార్చి 6 నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుధ్యంతో పాటు పెండింగ్‌ ఫైళ్లను క్లియర్‌ చేయనుంది. మార్చి 6 నుంచి జూన్‌ 12 వరకు.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముందస్తు ఉత్సవంగా ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్య దర్శులను ఇందులో భాగస్వాములను చేసింది. గ్రామ సభలు, వార్డు సభల నిర్వహణతో పాటు మండల, పట్టణ, నియో జకవర్గ, జిల్లా కేంద్రాల్లో సరికొత్త కార్యాచరణకు నడుం బిగించింది.

మండల, జిల్లా కేంద్రాల్లో వివిధ శాఖల అధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయనుంది. అన్ని స్థాయిల్లోనూ గ్రామ సర్పంచి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది. రెండేండ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, వాటితో లబ్ధి పొందిన కుటుంబాలు, ఆయా వర్గాలకు చేసిన మేలును క్షేత్ర స్థాయిలో వివరించడంతో పాటు అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు తప్పకుండా అందించాలనే సంకల్పంతో ఈ సభలను ఏర్పాటు చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో వస్తున్న సంస్కరణలు, వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దే ప్రణాళికను ప్రజలకు వివరించనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించే 100 తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను గుర్తించి, పిల్లల తల్లితండ్రుల్లో అవగాహన పెంచనుంది.

విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా పునరుత్పాదక విద్యుత్‌, ప్రధానంగా సోలార్‌ విద్యుత్‌ వినియోగం పెంచటం, దాని ఉత్పత్తి ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలను ప్రజలకు, రైతులకు తెలియజేయనున్నది. ఖాళీ స్థలాలుండి ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలనే ప్రజా ప్రభుత్వ లక్ష్యాన్ని నూటికి నూరు పాళ్లు అమలయ్యేలా చూడాలని సంకల్పించింది. పదేండ్లుగా ఇవ్వని రేషన్‌ కార్డులను అర్హులైన వారందరికీ ఇవ్వాలనీ, ఇదో నిరంతర ప్రక్రియగా అమలు చేయాలని నిర్ణయించింది. యువతకు నైపుణ్యాల శిక్షణతో పాటు ఉపాధి కల్పించే కార్యక్రమాలు 99 రోజుల యాక్షన్‌ ప్లాన్లో చేపట్టనుంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో జాబ్‌ మేళాలు నిర్వహించి లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనేది టార్గెట్‌గా ఎంచుకుంది.ఇందిరా మహిళా శక్తి సాధిస్తున్న విజయాలను, కొత్తగా వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించనుంది. అన్ని జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనాలను ప్రారంభించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -