Monday, March 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు99 రోజుల పార్టీ ప్రణాళిక

99 రోజుల పార్టీ ప్రణాళిక

- Advertisement -

‘గ్రేటర్‌’ ఎన్నికలే లక్ష్యంగా సీఎం వ్యూహం
రంగారెడ్డిపైనా పట్టుకు స్కెచ్‌
బలహీనంగా ఉన్న చోట పుంజుకునేందుకు ప్రణాళికలు
మున్సిపోల్స్‌లో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ కార్యక్రమాల ఏకరువు.. పార్టీ బలోపేతమే లక్ష్యం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ శరవేగంగా పావులు కదుపుతోందా? అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు అత్యధిక స్థానాలు కట్టబెట్టిన హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో హస్తం పార్టీని బలోపేతం చేయటంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు నిర్వహించిన ప్రజా పాలన, బేగంపేటలో నిర్వహిస్తోన్న ప్రజావాణి కార్యక్రమాలు ఉండగా… ఇప్పుడు మళ్లీ ’99 రోజుల ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌’ అంటూ సర్కారు ప్రకటించటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.

అసెంబ్లీ, పార్లమెంటు, ఉప ఎన్నికలు, పంచాయితీ, మున్సిపల్‌ ఎలక్షన్లలో గెలుపు జెండాను ఎగరేసినప్పటికీ ఇప్పటికిప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు అధికార పార్టీ సంసిద్ధం కాకపోవటాన్నిబట్టి ఈ వాదన మరింత బలపడుతోంది. దీన్ని మరింత లోతుగా పరిశీలిస్తే… ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 99 రోజులపాటు నిర్వహించే ఈ ప్రోగామ్‌…తమకు అత్యంత కీలకమని, ప్రతీ రోజూ అమూల్యంగా భావించి పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. అయితే ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమమే కాదని, పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఉద్దేశించిన ప్రోగ్రామ్‌ అని కాంగ్రెస్‌ నేతలే చెబుతుండటం గమనార్హం.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ బలంగా ఉన్నట్టు కనబడుతోంది. కానీ అసెంబ్లీ ఎన్నికల నుంచి మున్సిపల్‌ ఎలక్షన్ల వరకూ పరిశీలిస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌లో అది పట్టు సాధించలే కపోయింది. వాస్తవానికి ఇక్కడ ఆ పార్టీకి సరైన లీడర్లుగాని, క్యాడర్‌గానీ లేదు. ఈ ప్రాంతంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఫలితంగా మున్సిపోల్స్‌లో ఇక్కడ బీఆర్‌ఎస్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మరోవైపు పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికల్లో కొన్ని చోట్ల ఎదురైన అనుభవాలు కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. సీనియర్‌ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న పలు మున్సిపల్‌ ప్రాంతాల్లో హస్తం పార్టీ అపజయం పాలైంది.

మంత్రి గడ్డం వివేక్‌ బాధ్యుడిగా ఉన్న క్యాతనపల్లిలో ఆ పార్టీ ఓటమి పాలైంది. మరో మంత్రి వాకిటి శ్రీహరి నియోజకవర్గ పరిధిలోని అమరచింత మున్సిపాల్టీ బీఆర్‌ఎస్‌ ఖాతాలో పడింది. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న వేములవాడలో కూడా కాంగ్రెస్‌కు చుక్కెదురైంది. నారాయణపేటలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఉన్నప్పటికీ… అక్కడ బీజేపీ గెలిచింది. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్‌గల్‌, దేవరకద్ర తదితర చోట్ల కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులేర్పడ్డాయి. గద్వాల, ఖానాపూర్‌, మహబూబాబాద్‌, వర్దన్నపేట, ఇబ్రహీంపట్నం తదితర మున్సిపాల్టీల్లో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీచాయి. ఈ నేపథ్యంలో పార్టీ బలహీనంగా ఉన్న గ్రేటర్‌తోపాటు పలు జిల్లాలు, మున్సిపాల్టీల్లో పార్టీని బలోపేతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు.

ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు సీనియర్‌ మంత్రులతో కొద్ది రోజుల క్రితం ఆయన సమాలోచలు చేశారు. అనంతరం ’99 రోజుల ప్రణాళిక’ రూపుదిద్దుకుందని సమాచారం. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయికి వెళ్లి, ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం ఆదేశించారు. పనిలో పనిగా ఆయా ప్రాంతాల్లో పార్టీ బలబలాలు, వెనుకబడటానికి గల కారణాలను అన్వేషించాలని ఆయన సూచించారు. అనంతరం 99 రోజుల్లో ‘దిద్దుబాటు’ కార్యక్రమాలను చేపట్టేందుకు వీలుగా వ్యూహం రచించనున్నారని తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -