Tuesday, October 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్సారెస్పీ-2కు భీంరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలి

ఎస్సారెస్పీ-2కు భీంరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలి

- Advertisement -

– ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ – ముషీరాబాద్‌

శ్రీరామ్‌సాగర్‌ రెండో దశకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ పార్లమెంటు సభ్యులు భీంరెడ్డి నరసింహారెడ్డి(బీఎన్‌) పేరు పెట్టాలని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యాలయం ఓంకార్‌ భవన్‌లో సోమవారం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన శ్రీరామ్‌సాగర్‌ రెండో దశకు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు పెట్టడంపై స్పందించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొదలైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి భీంరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వం వహించారని తెలిపారు. ఆ సమయంలో పేదలకు వందలాది ఎకరాల భూములు పంచడంతోపాటు.. వారిలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం కలిగించారని గుర్తుచేశారు. అసెంబ్లీ, పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయాలకు అతీతంగా సేవలందించారని తెలిపారు. గోదావరి జలాలను వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఎగువ మండలాలకు తరలించే లక్ష్యంతో నిరంతరం పోరాడిన భీంరెడ్డి 1996 మార్చి 6న తిరుమలగిరి ప్రగతినగర్‌ వద్ద శంకుస్థాపన చేశారని వివరించారు. ”గోదావరి జలాలు నా గొంతులో పడిన తరువాతనే నాకు విరమణ” అంటూ నినదించిన భీంరెడ్డి 2008 మే 9న అమరత్వం పొందారని తెలిపారు. అంతటి మహానేత పేరును శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు రెండో దశకు పెట్టాలని, రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి పేరును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మైదం శెట్టి రమేష్‌, తుడుం అనిల్‌కుమార్‌, తాండ్ర కళావతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -