Tuesday, October 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసంక్షేమ పథకాలన్నీ మున్సిపల్‌ కార్మికులకు వర్తింపజేయాలి

సంక్షేమ పథకాలన్నీ మున్సిపల్‌ కార్మికులకు వర్తింపజేయాలి

- Advertisement -

రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపు
– నేడు, రేపు తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ : యూనియన్‌ (సీఐటీయూ)
రాష్ట్ర మహాసభలు : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కారదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-తుర్కయంజాల్‌

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ మున్సిపల్‌ కార్మికులకు వర్తింపజేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభలను రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ మున్సిపల్‌ పట్టణం, మన్నెగూడలోని నీలం సంజీవరెడ్డినగర్‌లోని చలసాని వారి కల్యాణ మండపంలో ఈనెల 14,15 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు.రెండ్రోజుల పాటు జరిగే సభలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సోమవారం మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తుర్కయంజాల్‌లో పాలడుగు భాస్కర్‌ పర్యటించారు. అనంతరం స్థానిక రాగన్నగూడలోని సీఐటీయూ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం 11 గంటలకు రాగన్నగూడ మున్సిపల్‌ వార్డు కార్యాలయం నుంచి మహాసభ ప్రాంగణం వరకు వేలాది మంది కార్మికులతో మహా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నామని అన్నారు. అనంతరం జరిగే మహాసభలో మూడేండ్ల కాలంలో జరిగిన కార్యక్రమాలపై, ప్రభుత్వం కార్మిక వర్గంపై అనుసరించిన విధానాలను సమీక్షించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకొని ముందుకెళ్తామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే అనేకసార్లు మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై విన్నవించినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. అధికారంలోకి రాకముందు కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తామని, పనికి తగ్గ వేతనాలు ఇస్తామని కాంగ్రెస్‌ చేసిన వాగ్దానాలు అమలు చేసే పరిస్థితి లేదని విమర్శించారు. మున్సిపాలిటీల్లో వివిధ విభాగాల్లో పని చేసే ఔట్‌ సోర్సింగ్‌, ఎన్‌ఎమ్‌ఆర్‌, పార్ట్‌ టైం, ఫుల్‌ టైం కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 2వ పీఆర్‌సీ ప్రకటించడంలో తీవ్రమైన జాప్యం జరుగుతుందని, తక్షణమే ప్రకటిం చాలని కోరారు. కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలని, కార్మికులందరికీ వారాంతపు సెలవు లతో పాటు ప్రభుత్వ సెలవులను కూడా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహాసభలకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్‌, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్‌, జిల్లా ఉపాధ్యక్షులు డి.కిషన్‌, డి.జగదీష్‌, జిల్లా కమిటీ సభ్యులు ఈ.నర్సింహ, టి.నర్సింహ, సీహెచ్‌ ఎల్లేష్‌, తుర్కయంజాల్‌ మున్సిపల్‌ నాయకులు ఎం. సత్యనారాయణ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -