నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తే ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని కిషన్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉందని రాజాసింగ్ గుర్తుచేశారు. “కిషన్ రెడ్డి గారూ, జూబ్లీహిల్స్‌లో మీరు బీఆర్ఎస్‌ను గెలిపిస్తారా లేక కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? అని ప్రజలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇది మీ గౌరవానికి సంబంధించిన విషయం” అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
అంతటితో ఆగకుండా, “ఒకవేళ మీరు భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలైతే కేంద్రంలోని పెద్దల ముందు మీ ముఖం ఎలా చూపిస్తారు? ఈ విషయం గురించి కొంచెమైనా ఆలోచించారా?” అని విమర్శించారు. తనపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, “నన్ను నాశనం చేసి బయటకు పంపించారు. ఏదో ఒక రోజు మీరు కూడా కచ్చితంగా వెళ్తారు” అంటూ కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు.