నవతెలంగాణ- దుబ్బాక
ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునే ప్రజాదరణ కలిగి ఉన్న వారికే డీసీసీ అధ్యక్ష పదవి వరిస్తుందని, గ్రామీణ కాంగ్రెస్ కార్యకర్త స్థాయి నుంచి జాతీయ అగ్ర నాయకుని వరకు అధిష్టానం దేశవ్యాప్తంగా ఇదే సూత్రాన్ని అమలు చేస్తుందని ఏఐసీసీ అబ్జర్వర్, కాంగ్రెస్ ఉత్తరాఖండ్ మహిళా అధ్యక్షురాలు జ్యోతి రౌటేలా చెప్పారు. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల మన్ననలు పొందిన వారి పట్ల అధిష్టానం మొగ్గుచూపుతోందని, పైరవీలు ఏ మాత్రం పని చేయబోవని స్పష్టం చేశారు. మంగళవారం దుబ్బాక లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా డీసీసీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి, కాంగ్రెస్ దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పూజల హరికృష్ణ లతో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆమె మెడలో దుబ్బాక చేనేత కార్మికులు నేసిన దండను వేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమెను చేనేత శాలువాలు కప్పి సన్మానించారు.
సిద్దిపేట జిల్లా నూతన డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న పలువురు ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించారు. అన్ని కోణాల్లో విశ్లేషించి, కార్యకర్తల అభిప్రాయాలను పరిశీలన జరిపిన తర్వాతే అధిష్టానానికి ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను అందజేస్తామన్నారు. గతంలో ఇదే విధానాన్ని గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యాన వంటి రాష్ట్రాల్లో నిర్వహించామని, తెలంగాణలోనూ ఇదే పద్ధతిని అమలు చేస్తున్నామని వెల్లడించారు. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.