నవతెలంగాణ ఢిల్లీ: తమిళనాడు మద్యం కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు జరుపుతోన్న ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్న రాష్ట్ర పోలీసుల హక్కులను లాగేసుకోవడం లేదా? అని సర్వోన్నత న్యాయస్థానం ఈడీని ప్రశ్నించింది. ఈ సందర్భంగా సమాఖ్య వ్యవస్థ సంగతేంటని మరోసారి నిలదీసింది.
తమిళనాడులో మద్యం రిటైలర్ ‘టాస్మాక్’లో అవకతవకలకు సంబంధించి రాష్ట్ర పోలీసులు, అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో మార్చిలో ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో సోదాలు జరిపింది. మే నెలలో సంబంధిత అధికారుల ఇండ్లల్లోనూ తనిఖీలు చేసింది.
చివరకు ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరుకుంది. విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈడీ అన్ని హద్దులు దాటుతోందని, సమాఖ్య పాలన భావనను ఉల్లంఘిస్తోందని ఆక్షేపించింది. టాస్మాక్‌పై జరుగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తుపై స్టే విధించగా.. తాజాగా విచారణ పునఃప్రారంభించింది. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం మరోసారి ఈడీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
‘‘రాష్ట్ర పోలీసుల హక్కులను ఉల్లంఘించడం లేదా? మీకు అనుమానం వచ్చినప్పుడల్లా మీ సొంతంగా దర్యాప్తు చేస్తారా? సమాఖ్య వ్యవస్థకు ఏమైంది..? ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయడం లేదా? శాంతి భద్రతలను ఎవరు నియంత్రిస్తారు. గత ఆరేండ్లలో ఈడీకి సంబంధించి ఎన్నో కేసులు నేను చూశాను. మళ్లీ నేనేం చెప్పదలచుకోలేదు’’ అని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.