నవతెలంగాణ – వనపర్తి
ఖరీఫ్ 2025-26 సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి, ఎఫ్ఏక్యూ నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ తో కలిసి ఖరీఫ్ 2025-26 సీజన్ వరి ధాన్యం కొనుగోళ్ల అంశంపై సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ 2025-26 సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి, ఎఫ్ఏక్యూ నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం ఏఈఓ లకు, పీపీసీ ఇంచార్జి లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.
రాబోయే 10 రోజుల్లో క్రాప్ బుకింగ్ నిర్వహించి జిల్లాలో ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు, ఎంత ధాన్యం ఉత్పత్తి అవుతుందనే పక్కా సమాచారాన్ని తెలియజేయాలనీ జిల్లా వ్యవసాయ అధికారికి ఆదేశించారు. ధాన్యం ఉత్పత్తి ఆధారంగా జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై ముందుకు వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు. నాణ్యమైన ధాన్యాన్ని గుర్తించే విషయంపై బుధవారం మండల వ్యవసాయ అధికారులకు, ఏఈఓ లకు సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. ఆ తర్వాత వారు ప్రతి పి పి సి ఇన్చార్జిలకు నాణ్యమైన ధాన్యాన్ని గుర్తించే విధంగా, అన్ని అంశాలపై శిక్షణ ఇవ్వాలని, శిక్షణ కార్యక్రమానికి ప్రతి పీపీసీ నుంచి ఇద్దరు తప్పనిసరిగా హాజరు అయ్యేలా చూసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా బ్యాంక్ గ్యారంటీలు సమర్పించిన రైస్ మిల్లర్లకే ధాన్యం కేటాయించడం జరుగుతుందని వారికి సమావేశం నిర్వహించి తెలియజేయాలన్నారు.
వరి ధాన్యం కొనుగోళ్లలో ట్రాన్స్పోర్ట్, హమాలి కొరత ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేయబోయే అన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన కనీస సదుపాయాలు తాగునీరు, టెంట్ సహా కొనుగోళ్లకు కావలసిన సామాగ్రి బరువు కొలిచే యంత్రాలు, గన్ని బ్యాగులు, టార్పాలిన్ కవర్లు, తేమ కొలిచే యంత్రాలు, సన్న దొడ్డు రకాన్ని గుర్తించే కాలిపర్స్ లు, అన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, డి ఎం జగన్ మోహన్, డి సి ఓ రాణి, డి ఆర్ డి ఓ పి డి ఉమాదేవి, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, డిటిఓ మానస, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, తూనికలు కొలతల అధికారి రవీంద్ర, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES