బాల్య వివాహాలతో జీవితాంతం కష్టాలు
ఆర్ డి ఎస్ ప్రెసిడెంట్ చిన్నమ్మ థామస్
నవతెలంగాణ – వనపర్తి
బాలికల హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఇంటిలోనూ తల్లిదండ్రుల అన్నదమ్ములే ఆ బాధ్యతను తీసుకుంటే వారికి కష్టాలు తప్పుతాయని ఆర్ డి ఎస్ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ అన్నారు.
వనపర్తి జిల్లాలోని గవర్నమెంట్ బాలికల ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామంలో పంచాయతీ సెక్రెటరీ వెంకటేష్ తో బోర్డులను రిలీజ్ చేసి దేవాలయం దగ్గర బాల్య వివాహాలకు వ్యతిరేకంగా బోర్డును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న చిన్నమ్మ థామస్ మాట్లాడుతూ బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం 18 సంవత్సరాల లోపు బాలికకు, 21 సంవత్సరాలలోపు బాలురకు వివాహం చేస్తే రెండు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుందని తెలిపారు.
బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా డయల్ 100 కి సమాచారం తెలపాలని బాలికలకు సూచించారు. ప్రతి గ్రామంలో గుడిలలో, మసీదులలో, చర్చిలలో బాల వివాహాలకు వ్యతిరేకంగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటివల్ల ప్రజలు నిత్యం ఈ బోర్డులను చూడడం వలన వారికి బాల్య వివాహాల వలన జరిగే అనర్థాలు, శిక్ష, చట్టాలు తెలుస్తాయన్నారు. క్రమంగా బాల్య వివాహాలు తగ్గుముఖం పడతాయన్నారు. అనంతరం గ్రామ ప్రజలతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. వనపర్తి లోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులచే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ వెంకటేష్, ఐఎల్ పి స్టాఫ్ కల్పన, ఏ టు జె సోషల్ మొబిలైజర్ కన్నన్ కుమార్, హెచ్ఎం ఉమాదేవి, ఉపాధ్యాయులు నూర్జన్, శారద గ్రామ ప్రజలు పాల్గొన్నారు.