Wednesday, October 15, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకార్మికుల పొట్ట కొట్టొద్దు

కార్మికుల పొట్ట కొట్టొద్దు

- Advertisement -

– ఇందిరమ్మ రాజ్యంలో పట్టించుకునే దిక్కేలేదు : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
– ప్రధాని మాటలే పేదలవి.. చేతలు పెట్టుబడిదారులవి
– కేసీఆర్‌ పాలనలో కార్మికులు నలిగిపోయారు
– తుర్కయంజాల్‌లో తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభ ప్రారంభం

– కార్మికుల భారీ ప్రదర్శన.. బహిరంగ సభ
– స్త్రీలకు పని ప్రదేశంలో భద్రత కల్పించాలి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.రమ
– కనీస వేతనం అమలు చేయాలి : సీఐటీయూ ఉపాధ్యక్షులు భూపాల్‌


నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
‘కార్మికుల కాళ్లు కడిగి, ఫొటోలకు ఫోజులు ఇస్తే సరిపోదు.. కార్మికుల కడుపు నింపాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్రమోడీపై ఉంది’ అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. మీడియా, సమాజం ముందు బహిరంగంగా సఫాయి కార్మికుల కాళ్లు కడిగి.. లోపలి గదిలో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఇచ్చే శానిటైజర్‌తో చేతులు కడుక్కోవడాన్ని సమాజం గమనిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల మొసలి కన్నీరు కార్చడం కాదని, దమ్ముంటే నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభ రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ మున్సిపల్‌ పట్టణంలో మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మన్నెగూడలోని నీలం సంజీవరెడ్డినగర్‌లో చలసాని వారి కళ్యాణ మండపం వద్ద యూనియన్‌ జిల్లా కార్యదర్శి కిషన్‌ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు.

అంతకు ముందు రాగన్నగూడ సీఐటీయూ కార్యాలయం నుంచి మహాసభ ప్రాంగణం వరకు వేలాది మంది కార్మికులతో భారీ ప్రదర్శన చేపట్టారు. ‘కార్మికుల ఐక్యత వర్థిల్లాలి. సమస్యలు పరిష్కరించాలి. కనీస వేతనం అమలు చేయాలి’ అని పెద్దఎత్తున నినాదాలతో హౌరెత్తించారు. బహిరంగ సభలో పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మికులను, కర్షకులను బానిసలుగా తయారు చేసే నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలతో కార్మిక చట్టాలను సాధించుకుంటే.. పెట్టుబడిదారుల కోసం మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తోందన్నారు. కార్మికుల దినసరి కూలీ రూ.278 సరిపోతాయా..? అంటే నెలకు రూ.5 వేలతో బతకొచ్చని మోడీ చెబుతున్నారన్నారు. ‘మోడీని, ఎంపీలను, ఎమ్మెల్యేలను అడుగుతున్న.. మీకు దమ్ముంటే మీరు చేసిన నిర్ణయాలపై నిలబడండి.. నెలకు రూ.5వేలతో బతకొచ్చు అంటున్నారుగా.. రోజుకు రూ.178 మీరు తీసుకుని మీ కుటుంబాన్ని సాకండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం’ అని భాస్కర్‌ సవాల్‌ విసిరారు. ‘కార్మికుల ఓట్లతో గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులు బతకడానికి లక్షల్లో వేతనాలు కావాలి.. కూలీలు పొద్దంతా మురికిలో మునిగిపోయి శ్రమిస్తే వారిని రూ.278తో ఎలా బతకమంటారు..?’ అని ప్రశ్నించారు.

”తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు అధికారం లోకి వచ్చిన కేసీఆర్‌ కార్మికుల సమస్యలను ఖాతర్‌ చేయలేదు. కనీసం కార్మిక సంఘాలను గుర్తించలేదు.. రోడ్డెక్కితే అరెస్టులు, జైలు అని బెదిరింపులకు గురి చేశారు. ఈ నియంతను గద్దె దింపి.. ఇందిరమ్మ రాజ్యం అని తెచ్చుకుంటే.. .. కొత్త సీసాలో పాత సారాయి పోసిన చందంగా ఉంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలను సీఎం గంగలో కలిపారని విమర్శించారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి కర్నాటక, మహారాష్ట్ర, జపాన్‌, జర్మన్‌ సుద్దులు చెప్పడం కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్మికులకు ఇస్తున్న వేతనం రూ.21వేల గురించి పరిశీలించాలి’ అని సూచించారు. 2వ పీఆర్‌సీకి సంబంధించిన ఫైల్‌ సీఎం దగ్గరే ఉందని, దాన్ని వెంటనే ఆమోదించాలని కోరారు. దాన్ని ఆమోదించే క్రమంలో లాస్ట్‌ బేస్‌డ్‌ స్కేలు కనీసం రూ.30వేలు ఉండేలా చూడాలన్నారు. కనీసం వేతనం అమలు చేయకపోతే కార్మికుల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

పేరుకే ప్రజాపాలన : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌. రమ
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించి.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ చెప్పుచేతుల్లో నడుస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.రమ విమర్శించారు. పేరుకే ప్రజాపాలననీ.. పాలనంతా పెత్తందారుల కోసమేనని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టాల్సిన ప్రభుత్వ పెద్దలు.. మహిళల వస్త్రధారణపై హేళన చేస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికుల కనీస వేతనం అమలు చేయాలి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌
మున్సిపల్‌ కార్మికులు ఈ సమాజాన్ని శుద్ధి చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వాలు మాత్రం ఆ కుటుంబాలను ఆదుకోవడం లేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారికి కనీసవేతనం అమలు చేయాలని కోరారు. కార్మికులు తిరగబడితే ప్రభుత్వాలు కూలిపోయే చరిత్ర ఉందని తెలిపారు. ఈ సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌, మున్సిపల్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్‌, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఎన్‌.రాజు, ఎం.చంద్రమోహన్‌, ఉపాధ్యక్షులు డి.జగదీశ్‌, వై.స్వప్న, దేవేందర్‌, ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు, కోశాధికారి ఎల్లేష్‌, ప్యాట్రన్స్‌ టి.నర్సింహా, నాయకులు శేఖర్‌, చందునాయక్‌, పాండు, ఎల్లయ్య, యం.సత్యనారాయణ, యాదగిరి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -