అమాంతం పెరిగిన 23 వేల ఓట్లు
స్పందించని ఎన్నికల సంఘం
నేడు హైకోర్టుకు వెళతాం: కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల చోరీకి పాల్పడిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వ్యవహరిస్తున్నదని ఆయన విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఒక్కసారిగా 23 వేల ఓట్లు పెరిగాయయనీ, 12 వేల ఓట్లు తొలగించబడ్డాయని చెప్పారు. అసాధారణ పెరుగుదల, తొలగింపులపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల కమిషన్ డ్యూటీని తన చేతుల్లోకి తీసుకుని అక్రమంగా ఓటు ఐడీలను పంపిణీ చేశారనీ, మైనర్ బాల, బాలికలకు కూడా పంచారని దుయ్యపట్టారు. ఈ ఫేక్ ఐడీల పంపిణీపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసిన నేపథ్యంలో తమ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు మొత్తం వ్యవహారాన్ని పరిశీలించినట్టు చెప్పారు.
”43 ఓట్లు ఉన్న సాంస్కృతి అపార్ట్‌మెంట్స్‌కు వెళ్లి చూశాము. ”ఇక్కడ ఉన్న వారికి, ఇంటి యజమానులకు, ఈ లిస్టులో ఉన్న వాళ్లకి ఎలాంటి సంబంధం లేదు” అని చెప్పారు. బూత్ నంబర్ 125లో ఒక ఇంట్లో 23 ఓట్లు ఉన్నాయి. 80 గజాలు మాత్రం ఉన్న ఇంట్లో అంత మంది ఎందుకు వచ్చారో మాకు తెలవదని యజమాని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ లీడర్‌కు సంబంధించిన ఇంట్లో 32 దొంగ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వ్యక్తులకు ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయి. ఇలా దొంగ ఓట్లు, రెండు మూడు ఓటర్ ఐడీ కార్డులు, ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్న వారి వివరాలను ఎన్నికల సంఘానికి ఇప్పటికే అందించాం. జూబ్లీహిల్స్‌లో ఓటుగా నమోదైన సిరిసిల్ల నివాసి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడితే తనకు సంబంధం లేకుండానే తన ఓటును జూబ్లీహిల్స్‌లో నమోదు చేసినట్టు ఆయన చెప్పారు. ఒక్కొక్క వ్యక్తికి రెండు మూడు ఎపిక్ కార్డులు ఉన్నాయి. ఓట్లన్నిటిని కూడా ఎన్నికల షెడ్యూల్ కింద రాయించారు. 42 ఓట్లు ఉన్నాయని ఓటర్ లిస్టులో పేర్కొన్న ఇంటి నెంబర్‌తో వెతికితే అసలు ఆ ఇల్లే లేదు. ఇవన్నీ కూడా ఒకటే రోజు ఓటర్ల జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం నింపింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్‌కు మూడు ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికి మూడు ఓట్లు ఉన్నాక స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయని అని తాము ఎలా అనుకోవాలి…. ” అని కేటీఆర్ ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ ఓట్ల చోరీ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌ను కలిసి పార్టీ తరఫున లేఖ కూడా ఇచ్చి 24 గంటలు దాటినా స్పందన లేదని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన 23 వేల ఓట్ల పైన సంపూర్ణ దర్యాప్తు జరపాలనీ, డూప్లికేట్, నకిలీ ఓట్లను వెంటనే డిలీట్ చేయాలనీ, ఈ ఓట్ల నమోదుకు, అక్రమాలకు పాల్పడిన అధికారులందరి పైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలని ఆయన కోరారు. ఎన్నికల సంఘానికి సంబంధించిన విశ్వసనీయత ప్రశ్నార్థకమైందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తాము లేవనెత్తిన ప్రతి అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కేవలం రెండు రోజుల్లోనే తమ పార్టీ కార్యకర్తలు అనేక అక్రమాలను గుర్తించ గలిగినప్పుడు ప్రభుత్వ అధికార యంత్రాంగం మొత్తం కలిగిన ఎన్నికల కమిషన్ ఎందుకు అక్రమాలను గుర్తించి తొలగించలేకపోతున్నది? అని ఆయన ప్రశ్నిం చారు. 24 గంటలు దాటినా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రానం దున బుధవారం హైకోర్టుకు వెళ్లనున్నట్టు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఓట్ చోరీ అంశం పైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో చోరీ ఓట్లతో ఎన్నికలలో గెలవాలని కాంగ్రెస్ చూస్తున్నదని ఆయన ఆరోపించారు. బీహార్ లో రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓట్ చోరీ అంశం కంటే జూబ్లిహిల్స్ లో ఓట్ చోరీ అంశం తక్కువేమి కాదన్నారు.