కండ్ల ముందు కనిపిస్తున్న వర్గీకరణ ఫలితాలు
అన్ని వర్గాలకు సముచితంగా విద్యావకాశాలు : మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్సీ వర్గీకరణ ఫలితాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయనీ, సామాజిక న్యాయం దక్కుతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అన్ని వర్గాలకు సముచితంగా విద్యావకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆయన విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్, మెడికల్ తదితర కోర్సుల్లో ఆయా వర్గాల విద్యార్థులకు వచ్చిన సీట్లు, ఇతర అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా డ్రాప్ అవుట్స్ అవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఫాకల్టీ, సీనియర్లతో మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ నిర్వహించాలని ఆదేశించారు. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన పిల్లలకు కూడా ఈ ఏడాది మెడికల్, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో సముచిత సంఖ్యలో సీట్లు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతోనే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బావురి, మెహతర్, మాంగ్, బేడ బుడగ జంగం తదితర అత్యంత వెనుకబడిన కులాల పిల్లలకు ప్రభుత్వ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు వచ్చాయని అధికారులు మంత్రికి వివరించారు. ఎంబీబీఎస్‌లో ఎస్సీ గ్రూప్ 1లో ఉన్న కులాల పిల్లలకు 41 సీట్లు, ఎస్సీ గ్రూప్ 2లో ఉన్న కులాల పిల్లలకు 561 సీట్లు, ఎస్సీ గ్రూప్ 3లో ఉన్న కులాల పిల్లలకు 324 సీట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్‌లో ఎస్సీ గ్రూప్ 1లో ఉన్న కులాల పిల్లలకు 378 సీట్లు, ఎస్సీ గ్రూప్ 2లో ఉన్న కులాల పిల్లలకు 8,246 సీట్లు, ఎస్సీ గ్రూప్ 3లో ఉన్న కులాల పిల్లలకు 5,466 సీట్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఫార్మసీలో ఎస్సీ గ్రూప్ 1లో ఉన్న కులాల పిల్లలకు 60 సీట్లు, ఎస్సీ గ్రూప్ 2లో ఉన్న కులాల పిల్లలకు 1,603 సీట్లు, ఎస్సీ గ్రూప్ 3లో ఉన్న కులాల పిల్లలకు 898 సీట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.
ఇన్నాళ్లూ గుర్తింపునకు నోచుకోని వర్గాల పిల్లలకు కూడా వర్గీకరణ అమలుతో ఉన్నత విద్యావకాశాలు రావడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. దశాబ్దాల వర్గీకరణ కలను నెరవేర్చడం వలన మొదటి ఏడాదిలోనే ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. వర్గీకరణ సామాజిక న్యాయం సాధించ డానికే తప్ప ఏ కులానికి వ్యతిరేకం కాదని తాము మొదట్నుంచి చెబుతున్న విషయం నిరూపి తమైందని తెలిపారు. అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన పిల్లలు ఆర్థిక ఇబ్బందులు, ఇంగ్లీష్ భాష రాకపోవడం వంటి సమస్యలతో ఆత్మ న్యూనత భావానికి లోనయ్యే ప్రమాదం ఉందనీ, ఇది డ్రాప్ అవుట్స్‌కు దారి తీస్తుందని మంత్రి హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా విద్యా ర్థులు ఆత్మన్యూనతకు లోనవ కుండా చూసు కోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రత్యేక తరగతుల నిర్వాహించాలనీ, సైకాలజిస్టులతో మోటివేషన్ క్లాసులు చెప్పించాలని సూచించారు. విద్యార్థులను బందాలుగా ఏర్పాటు చేసి టీచింగ్ ఫాకల్టీని, సీనియర్ స్టూడెంట్లను మెంటర్లుగా నియమిం చాలని సూచించారు. అకాడమిక్స్‌తో పాటు లాంగ్వేజ్, ఇతరత్ర అవసరమైన స్కిల్స్ నేర్పించేందుకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎడ్యుకేషన్ సెక్రెటరీ డాక్టర్ యోగి తారాణా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కుమార్, జేఎన్‌టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంట చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.