న్యూఢిల్లీ : లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టును సవాలు చేస్తూ ఆయన భార్య గీతాంజలి జె.ఆంగ్మో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. సమయం తక్కువగా ఉన్నందున ఈ పిటిషన్‌పై విచారణను మరుసటి రోజుకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్.వి.అంజారియాలతో కూడిన ధర్మాసనం మంగళవారం పేర్కొంది. అక్టోబర్ 6న విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, లడఖ్ యంత్రాంగానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వాంగ్‌చుక్‌ను నిర్బంధించడానికి గల కారణాలను అందించాలని ఆమె చేసిన విజ్ఞప్తిపై ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్ విచారణను నేటికి వాయిదా వేసింది.
లడఖ్ రాష్ట్రహోదా , ఆరవషెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్‌పై చేపట్టిన ఆందోళనలపై పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా, 90మందికి గాయాలయ్యాయి. హింసను ప్రేరేపించారని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం వాంగ్‌చుక్‌ను కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) 1980 కింద ముందస్తుగా అరెస్ట్ చేసింది. ఈ అరెస్టును సవాలు చేస్తూ ఆయన భార్య ఆంగ్మో అక్టోబర్ ప్రారంభంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్త ఎక్కడ ఉన్నారో అధికారులు స్పష్టం చేయాలని, ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించాలని పిటషన్‌లో కోరారు. ఆయనను నిర్బంధించడానికి గల కారణాల గురించి లేదా ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
వాంగ్‌చుక్ అరెస్ట్ పిటిషన్‌పై విచారణ వాయిదా
- Advertisement -
- Advertisement -