– జేఎల్ పరీక్షా సెంటర్‌లోకి 8 మందికి నిరాకరణ
నవతెలంగాణ- కోదాడ
తమ కలలలు నెరవేర్చుకోవాలన్న పన్నెం డేండ్ల నిరీక్షణకు ఒక్క నిమిషం ఆలస్యంతో దూరమయ్యారు. బుధవారం జరిగిన టీఎస్ పీఎస్సీ జేఎల్ పరీక్షకు నిమిషం ఆలస్యంగా వచ్చారని అభ్యర్థులను పరీక్షాసెంటర్‌లోకి రాని వ్వలేదు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సనా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన టీఎస్పీఎస్సీ జేఎల్ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ఎనిమిది మంది అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. దాంతో అభ్యర్థులు ఎనిమిది మంది కాలేజీ గేటు ముందు ఆందోళనకు దిగారు. 12 సంవత్సరాల నిరీక్షణ ఒక్క నిమిషంలోనే అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షకు సమయానికే వచ్చామని, ఆ సమయంలో గేటు గుండా బీటెక్ విద్యార్థులను పంపించడం వల్ల తమకు లోపలికి వెళ్లేసరికి ఒక నిమిషం ఆలస్యం అయిందని చెప్పారు. కాలేజీ యాజమాన్యం మహిళలనే గౌరవం లేకుండా దురుసుగా ప్రవర్తించిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యాన్ని బతిమలాడినా కనుకరించకపో వడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులను, అధికారులను నిలదీశారు. సమయం అయిపోయిన తర్వాత వస్తే తమ బంధువులను కూడా పంపించలేదని కాలేజీ యాజమాన్యం చెప్పింది. దాంతో చేసేది ఏమీ లేక అభ్యర్థులు వెనుతిరిగి వెళ్లిపోయారు.