ఉద్యోగాలు చేయడం ఇష్టం లేక మొదటి నుండి వ్యాపారం చేసేవారు. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో సరిగా నడవలేని పరిస్థితి వచ్చింది. హాస్పిటల్స్ చుట్టూ ఎంత తిరిగినా ఫలితం లేకుండా పోయింది. చిన్న వయసులోనే అనేక సమస్యలు చుట్టుముట్టాయి. మానసికంగా, శారీరకంగా కుంగిపోయారు. వాటి నుండి బటయపడేందుకు యోగాపై దృష్టి పెట్టారు. మెల్లిమెల్లిగా మానసికంగానే కాక శరీరకంగా కూడా బలం పుంజుకున్నారు. దాంతో దీన్నే తన కెరీర్‌గా ప్రారంభించి నేడు ఎంతో మందికి ఆరోగ్య పట్ల అవగాహన పెంచుతున్న తనూజ పరిచయం నేటి మానవిలో…
తనూజ సొంత ఊరు నంద్యాల జిల్లా ముత్యాలపాడు(చాగలమర్రి) గ్రామం. తన బాల్యం, చదువు మొత్తం చాగలమర్రిలోనే జరిగింది. సాధారణ మధ్య తరగతి కుటుంబలో పెరిగిన ఆమె ఎం.బి.ఎ. చదివారు. వివాహం జరగడంతో కర్ణాటకలోని గౌరీబిదనూరుకు వెళ్లారు. ఆరేండ్లు పూర్తిగా కుటుంబ బాధ్యతల్లోనే మునిగి పోయారు. ఉద్యోగం చేయడం ఇష్టం లేని ఆవిడ చాక్లెట్ మేకింగ్ వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు.
పలు సమస్యలు చుట్టుముట్టి
ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న ఆమెకు అనుకోకుండా కుడికాలు లీగమెంట్ సమస్య వచ్చింది. ఏడాదిపాటు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తిరిగి చివరికి డాక్టర్స్ ఇది ఇంక ఇంతే అని తేల్చేశారు. 30 ఏండ్లకే కింద కూర్చోలేకపోవడం, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, నడవలేక పోవడం ఆమెను కుంగదీశాయి. అదే సమయంలో తండ్రి మరణం, ప్రాణ స్నేహితుడి ఆక్సిడెంట్ తనూజను మానసికంగా కూడా ఇబ్బంది పెట్టాయి. డిప్రెషన్‌తో బరువు పెరగడం, పీసీఓడీ, మైగ్రేన్ వంటి సమస్యలూ ఇబ్బంది పెట్టాయి. అప్పుడే తనని తాను మార్చుకోవాలి, ఇలా ఉండిపోకూడదని సన్నిహితురాలి సలహాతో యోగ మొదలు పెట్టారు. కేవలం డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి యోగాను ఆశ్రయించిన తనూజకు తన అనారోగ్య సమస్యలన్నీ ఒకొక్కటి తగ్గిపోవడంతో యోగానే తన వృత్తిగా మార్చుకోవాలనుకున్నారు. వెంటనే సంబంధిత కోర్సులు చేసి తనలాంటి ఎంతో మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో యోగా టీచర్ అయ్యారు.
ఫేస్‌యోగా
చాలా మందికి యోగ మాత్రమే తెలుసు ఫేస్‌యోగాపై కొద్ది మందికి మాత్రమే అవగాహన ఉంది. కానీ దీని ద్వారా మన ముఖానికి సంబందించిన అన్ని సమస్యలు తగ్గించుకోవచ్చు. ఉదా:- గీతలు, ముడతలు, డబుల్‌చిన్, ముందస్తు వృద్ధాప్య ఛాయలు, మొటిమలు, నల్లమచ్చలు వంటి ఎన్నో సమస్యలు తగ్గించుకోవడంతో పాటు ముఖం ఎంతో కాంతివంతంగా, ఆకర్షణీయంగా సహజమైన పద్ధతిలో మార్చుకోవచ్చు. ఎటువంటి క్రీమ్స్,ఫేసియల్స్ అవసరమే ఉండదు.
థెరప్యూటిక్ యోగా
ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో శరీరానికి, మనసుకు సమతుల్యత కోల్పోవడం చాలా సాధారణం. అలాంటి పరిస్థితుల్లో ‘థెరప్యూటిక్ యోగా’ మన ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి అత్యంత సహజమైన మార్గం. థెరప్యూటిక్ యోగా అంటే కేవలం యోగా ఆసనాల సమాహారం కాదు. ఇది ఒక శాస్త్రీయ పద్ధతి, ప్రతి వ్యక్తి శరీర-మనస్సు అవసరాలను బట్టి రూపొందించే వ్యక్తిగత చికిత్సా సాధన. ఈ సాధనలో మృదువైన ఆసనాలు, శ్వాస నియంత్రణ (ప్రాణాయామం), ధ్యానం, జీవనశైలి మార్పులు ఉంటాయి. దీనివల్ల వెన్నునొప్పి, మెడ నొప్పి, స్పాండిలైటిస్, జాయింట్ పెయిన్స్/ ఆర్థరైటిస్, పీసీఓడీ/పీసీఓఎస్, థైరాయిడ్, అధిక బరువు, చెక్కర వ్యాధి(టైప్ 2), అధిక/అల్ప రక్తపోటు, ఊపిరి తిత్తుల సమస్యలు (అస్తమా, సైనసైటిస్), మైగ్రేన్‌తో పాటు సాధారణ తలనొప్పి, నెలసరి సమస్యలు లాంటి శారీరక సమస్యలే కాక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. శరీరంలోని ప్రతి అవయవానికి సమతుల్యత లభిస్తుంది. ఈ యోగా ప్రత్యేకత ఏమిటంటే మందుల్లాంటి తాత్కాలిక ఉపశమనం కాదు. వ్యాధి మూలాన్ని సరిచేస్తుంది.
పిలాటీస్ యోగా
పిలాటీస్ యోగా అనేది శరీరానికి బలం, సౌలభ్యం, సమతుల్యతను అందించే వ్యాయామ విధానం. ఇది కేవలం శరీర కదలికలకే పరిమితం కాదు ప్రతి శ్వాస, ప్రతి కదలికతో మనసు, శరీరాన్ని సమతుల్యంలో ఉంచుతుంది. పిలాటీస్ యోగా కోర్ బలాన్ని పెంచుతుంది. కడుపు, వెన్ను, నడుము, తొడల భాగాలను బలపరుస్తుంది. అలాగే శ్వాస నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీని వల్ల మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. శరీరం ఆకారంలోకి వస్తుంది. ఇది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ అనుకూలమైన వ్యాయామం. ప్రత్యేకంగా రోజంతా కూర్చునే ఉద్యోగులు, ప్రసవానంతరం బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమమైన మార్గం.
బాల యోగ
ఇప్పటి పిల్లల జీవనశైలి మనం ఊహించని విధంగా మారిపోయింది. స్కూల్ ఒత్తిడి, గాడ్జెట్లకు బానిసత్వం, ఫోకస్ లేకపోవడం, కోపం, ఆందోళన ఇవన్నీ చిన్న వయసులోనే కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ‘బాల యోగ’ వారికి ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనసు, స్థిరమైన దృష్టి అందించే అత్యంత సహజమైన సాధన. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యోగా సాధన. అంటే ఆటలతో, కథలతో, మృదువైన ఆసనాలతో కలిపి, పిల్లలు ఆనందంగా నేర్చుకునే విధానం. ఇది క్రమశిక్షణ నేర్పిస్తుంది, సృజనాత్మకత, ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది. శరీర బలం-సౌలభ్యం పెరుగుతుంది. జిమ్నాస్టిక్ లాంటి ఫ్లెక్స్‌బులిటీ వస్తుంది. ఆత్మవిశ్వాసం, సానుకూలత పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రోగానిరోధక శక్తి, అరుగుదల మెరుగుతాయి.
విన్యాసా యోగ
‘విన్యాసా’ అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. ‘వి’ అంటే ప్రత్యేకమైనది. ‘న్యాస’ అంటే క్రమబద్ధంగా అమర్చడం, అంటే ప్రతి శ్వాసకు అనుగుణంగా క్రమబద్ధంగా చేసే చలనాల సమాహారం అని అర్థం. ప్రతి ఆసనాన్ని శ్వాస పద్ధతికి అనుసరించి సాఫీగా కలిపే యోగా విధానమే విన్యాసా యోగ. దీన్ని ‘ఫ్లో యోగా’ అని కూడా అంటారు. ఇది బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. శరీర సడలింపు పెరుగుతుంది. కండరాలు బలపడతాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర సమస్యలు తగ్గుతాయి.
Yin యోగ
ఇది అనేది శరీరంలోని లోతైన కండరాలు, లిగమెంట్స్, ఫాస్షియా, జాయింట్స్‌పై పనిచేసే నెమ్మదైన యోగా విధానం. ఇందులో ప్రతి ఆసనాన్ని 3 నుంచి 7 నిమిషాల పాటు స్థిరంగా ఉంచుతారు. శరీరాన్ని సడలించి అంతరంగ శాంతిని పొందుతారు. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. జాయింట్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలోని బిగుసుకున్న భాగాలు సడలుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. తనూజ ఇన్ని రకాల యోగ విధానాలలో పట్టభద్రులు అవ్వడమే కాక, ఎవరికి ఏ యోగా సాధన అవసరమో తెలుసుకుని శిక్షణ ఇస్తూ ఎంతో మందికి సహాయపడుతున్నారు.
- పురుషోత్తం సతీష్