ఈనెల ఆరున దేశం యావత్తు నివ్వెరపోయింది. భారత న్యాయచరిత్రలో సుప్రీంకోర్టు ఘోరమైన అవమానాన్ని చవిచూసింది. న్యాయవ్యవస్థకు కళంకం తెచ్చే ఘటన చోటుచేసుకుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ రామకృష్ణ గవాయ్ పై డెబ్బయి ఏండ్ల వయసున్న సీనియర్ న్యాయవాది రాకేష్ కిషోర్ తన కాలు బూటుతీసి గవాయ్ పైకి విసిరేసాడు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. ఇదో చీకటి రోజు. ఇలా ఎందుకు జరిగింది? ఆ న్యాయవాదికి అంతటి ఆగ్రహం ఎందుకొచ్చింది? దీని వెనకాల ఉన్నదెవరు? దేశ ప్రజలు పరిశీలించాల్సిన సమయమిది.
బూటు విసిరిన అనంతరం కోర్టు పరిధిలో ఉన్న పోలీస యంత్రాంగం, సిబ్బంది అతన్ని పట్టుకుని అరెస్టు చేస్తున్నప్పుడు ‘సనాతన ధర్మానికి ఎవరు అడ్డు వచ్చినా సహించము. మా దేవుడు నాతో ఈ పని చేయించాడు. మా ధర్మానికి అడ్డు వస్తే మళ్లీ చేయటానికి కూడా నేను వెనకాడను’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. సిజెఐ మాత్రం చాలా హుందాతనంగా ‘ఇలాంటి ఘటనలతో నన్ను ప్రభావితం చేయలేరు. కోర్టును సజావుగా సాగనీయండి’ అంటూ ప్రశాంతతను నెలకొల్పారు.
పైగా న్యాయవాదిపై కేసు పెట్టకూడదని చెప్పారు. ఈదాడి చూస్తే దేశంలో పెరిగిపోతున్న విద్వేషాలు, మతోన్మాద రాజకీయాలు, మూకదాడులు, ధర్మం ముసుగులో జరుగుతున్న దౌర్జన్యాలను తెలియజేస్తున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే ఇంతటి అవమానం జరిగితే సాధారణ దళితుల సంగతి ఏమిటనేదే ప్రశ్న. ఈ వివక్ష, అవమానం దళితుడు ఏ స్థాయిలో ఉన్నా అనుభవించాల్సిందేనా? 78ఏండ్ల స్వాతంత్య్ర ఫలాలు, డెబ్బయి ఐదు వసంతాల రాజ్యాంగ హక్కులు ఎవరికి దక్కుతున్నాయి? గతంలో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను పూరి జగన్నాథ ఆలయ ప్రవేశానికి నిరాకరించారు.ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును ఢిల్లీలోని భారత నూతన పార్లమెంటు భవనానికి, అయోధ్య రామమందిరం ప్రారంభానికీ ఆహ్వానించలేదు రాజ్యాంగబద్ధంగా దళితులు అత్యున్నత స్థానాల్లోకి ఎదిగిన వారు కూడా అవమానాలు, వివక్ష భరించాల్సిందేనని ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి. జస్టిస గవాయ్ పై జరిగిన దాడికి కారణం విశ్లేషిస్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖజురహోలో ఎప్పుడో మొఘలుల కాలంలో జవారియా ఆలయంలోని విష్ణుమూర్తి తల తీసేశారు.
దాన్ని పునరుద్ధరణ చేయాలంటూ ఫైల్ సుప్రీంకోర్టు బెంచ్ పైకి వచ్చింది. ఆ దేవాలయంలో పూజారి ఉండరు, పూజలేవి జరగవు. అది ఒక పర్యటక ప్రాంతం, అక్కడి శిల్పాల సందర్శనార్థం ప్రజలు వస్తుంటారు. ప్రస్తుతం అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా ఆ సర్కార్‌నే. విష్ణుమూర్తి తల పెట్టించడానికి వారు తలచుకుంటే అరగంట సమయం కూడా పట్టదు. కానీ, ఆ పని చేయకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ముసుగులో హిందుత్వ అంశాన్ని ప్రచారంలో పెట్టడానికి సుప్రీంకోర్టుకు దాన్ని చేర్చారు. విష్ణుమూర్తి తలను పెట్టించాలని సెప్టెంబర్ 15న ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ‘అది కోర్టు పరిధి కాదు.ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కిందకు వస్తుంది.యునెస్కో పరిధిలో ఉంది గనుక వారిని సంప్రదించండి’ అని సిజెఐ సమాధానమిచ్చారు. అప్పటినుండి దాదాపు ఇరవై రోజుల పాటు ‘జస్టీస్ గవాయ్ హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నాడు, ఆయన సనాతన వ్యతిరేకి’ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది ప్లాన్ ప్రకారం విద్వేషాన్ని రెచ్చగొట్టారు. ‘కోర్టు అనంతరం ఆయన కారును అడ్డగించండి. అది మాత్రమే సరిపోదు, ఆయన మొహంపై ఉమ్మేయండి’ అంటూ పోస్టులు పెట్టారు. రాకేష్ కిషోర్ లాంటి న్యాయవాది జస్టిస్‌పైకి బూటు దాడికి పురిగొల్పింది ఈ మత విద్వేషమే ప్రేరణే.ఎందుకంటే, దాడి తర్వాత ఆయన మాటల్ని బట్టి చూస్తే కేవలం క్షణికావేశంలో చేసిన పనికాదు, అది పథకం ప్రకారం ప్రకారం..విద్వేషపు విషసర్పం విసిరిన బూటు.
ఈ దాడులు ఎందుకింత బహిరంగమయ్యాయి?అంటే కేంద్రంలో అధికారాన్ని వెలగబెడుతున్న మోడీ ప్రభుత్వమే కారణం. నిత్యం సనాతన ధర్మాన్ని వల్లెవేస్తూ, దానికేదో ప్రమాదం ముంచుకొస్తుందంటూ చేసిన విద్వేష ప్రచార ఫలితమే ఇది. దళిత సామాజిక వర్గానికి చెందిన జస్టిస్ గవాయ్ మొదటినుంచి రాజ్యాంగానికి కంకణ బద్ధుడిగా పనిచేస్తున్న వ్యక్తి. ఆయన తీర్పులన్నీ సమానత్వం, మానవహక్కుల పట్ల స్థిరంగా ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదల ఇండ్లను బుల్డోజర్‌లతో కూల్చిన విషయంలో, ఎస్సీ,ఎస్టీల కేసులను విచారిస్తున్న సమయంలోనూ ఆయన అణగారిన వర్గాల పక్షాన నిలిచారు. పైగా నేడు న్యాయవ్యవస్థను లోంగదీసుకునేందుకు బీజేపీ ఎరగా వేస్తున్న ‘వాషింగ్ మిషన్’ పదవుల పందేరాన్ని కూడా ఖాతరు చేయలేదు. ఒకానొక సందర్భంలో రిటైర్‌మెంట్ కాగానే ప్రభుత్వాలిచ్చే పదవులు కూడా తీసుకోనని ముందుగానే చెప్పారు. ఇదంతా ఆయన నీతి, నిజాయితీకి ప్రతిబింబాలు. అవసరమైనప్పుడు కేంద్రం విధానాల్ని సున్నితంగా విమర్శిస్తూ రాజ్యాంగ మౌలిక సూత్రాలను బలోపేతం చేసేలా మాట్లాడటం ఆయన లౌకికతత్వానికి నిదర్శనం. ఇదే బీజేపీకి మింగుడుపడని సమస్యగా మారింది.
సీజేఐగా బాధ్యతలు స్వీకరించాక ఆయన తొలిసారిగా మహారాష్ట్రలో అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించేందుకు వెళ్లగా అక్కడి బీజేపీ రాష్ట్ర సర్కార్ ప్రొటోకాల్‌ను తొక్కిపెట్టి అవమానించింది. ఉన్నత స్థాయిలో హాజరు కావాల్సిన డీజీపీ, ముంబాయి పోలీస్ కమిషనర్ వంటి అధికారులు ఉద్దేశపూర్వకంగానే డుమ్మాకొట్టగా సుప్రీంకోర్టు మందలించగా పొరపాటును అంగీకరించింది. ఇటీవల మహారాష్ట్ర అమరావతిలో జరిగిన ఆరెస్సెస్ శత వార్షికోత్సవ ఆహ్వానాన్ని గవాయ్ తల్లిదండ్రులు తిరస్కరిస్తున్నట్టు ప్రకటించడం కూడా ఆరెస్సెస్‌కు కోపం తెప్పించింది! గతంలో ఎలక్టోరల్ బాండ్లలోని కేంద్రం క్విడ్ ప్రోకో, కాశ్మీర్‌లోని ఆర్టికల్ 370 రద్దు విషయంలో కూడా పాలకగణ వైఖరిని గవాయ్ తప్పు పట్టడం, తాజాగా బీహార్‌లో ఓటర్ల సవరణ పేరుతో ఆడుతున్న రాజకీయ డ్రామాలకు బ్రేకులు వేయడం పట్ల ప్రజల్లో బీజేపీ వ్యతిరేకత మూట కట్టుకుంది. ఇదంతా జీర్ణించుకోలేని ఆరెస్సెస్ పరివార్ గవాయ్ ని సనాతన వ్యతిరేకిగా ముద్రవేసింది. ఆధునిక ప్రజాస్వామ్య విలువ తెలియని ఆ ‘మూక’ అజ్ఞానంతో తిరోగమన విషబీజాల్లో చిక్కుకుని ఇప్పుడు దాన్ని ‘కోర్టుగోడల’ దాకా చేర్చి జస్టిస్‌పైనే దాడిచేసేలా విద్వేషానికి పురిగొల్పింది.
ఈ ఘటనకు ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్, ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి. దేశ ప్రజలకు వారివురూ బహిరంగ క్షమాపణ చెప్పాలి. పోలీస్ యంత్రాంగం సుమోటోగా తీసుకొని తక్షణమే రాకేష్ కిషోర్‌ను అరెస్టు చేయాలి. మన రాష్ట్రంలో కూడా విద్వేషాపు విషబీజాలు నాటేందుకు ఆరెస్సెస్-బీజేపీ పరివారం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే ప్రజల మెదళ్లను కలుషితం చేసే పనిలో పడ్డది. ఇటీవల సిద్దిపేట జిల్లా కోర్టులో ఇద్దరు ఆధిపత్య కుల న్యాయవాదులు ‘కనకనపు సింహమున శునకంను కూర్చుండబెట్టి’ అంటూ జస్టిస్ గవాయ్ పై పోస్టులు పెట్టడం చూస్తే కులాన్ని చాపకింద నీరులా ఎలా విస్తరిస్తున్నారనేది తెలుస్తుంది.ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలు ఏకోన్ముఖంగా ఖండించాలి. కషాయదళం మతాల మధ్య పెట్టే చీలికల పట్ల ప్రజల్లో చైతన్యం, అవగాహన పెంచాలి. వీటిని అరికట్టడానికి ఆ విద్వేషాలు నింపుతున్న వారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి.
టి.స్కైలాబ్‌బాబు
9177549646