Thursday, October 16, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅక్రమార్కులు

అక్రమార్కులు

- Advertisement -

తెలంగాణ అభివృద్ధికి కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవినీతి పెద్ద ఆటంకంగా మారింది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అడ్డుగోడగా నిలుస్తున్నది. సర్కారు మ్యానిఫెస్టోను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నది. అవినీతి, అభివృద్ధికి బద్దశత్రువు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం విలువ లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం. గత సర్కారు హయాంలో నిర్మితమైన కాళేశ్వరం సద్వినియోగం కాకపోవడం ఆందోళన కలిగించే విషయం. నీరు పల్లమెరుగుతుందన్నట్టుగా, ప్రాజెక్టు అవినీతినెరుగు అన్నట్టుగా మారింది. 2016లో చేపట్టిన ఈప్రాజెక్టు రాష్ట్ర ప్రజల పాలిట గుదిబండగా తయారైంది. పాలకులు, ప్రయివేటు కాంట్రాక్టర్లు, అధికారులు, ఇంజినీర్లు కుమ్మక్కయిన ఫలితంగా వందల కోట్ల ప్రజాధనం అవినీతిపరుల బొక్కసాల్లోకి వెళ్లింది. పలు సర్కారీ వ్యవస్థల నివేదికలు, న్యాయ విచారణ కమిషన్‌ రిపోర్టు ఆధారంగా ప్రస్తుత సర్కారు కొరడా ఝలిపించడాన్ని బట్టి ఈ సంగతి రుజువవుతున్నది. అయితే పాలకులు తీసుకునే చర్యల్లో చిత్తశుద్ధి అవసరం. అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించడం తప్పనిసరి.

కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వాములైన ఉన్నతాధికారుల నుంచి సాధారణ ఇంజినీర్ల వరకూ అవినీతి మకిలిని అంటించుకున్న వారే కావడం గమనార్హం. ఒక్క సాధారణ ఇంజినీర్‌ కాళేశ్వరం ప్రాజెక్టులో ఐదారేండ్లు పనిచేసి సుమారు రూ.110 కోట్ల సొమ్మును వెనకేశాడంటేనే అవినీతి తీవ్రత ఎంతటిదో అర్థమవుతున్నది. కేవలం ముగ్గురు ఇంజినీర్ల ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.400 కోట్లుగా ఉంది. ఆలోచిస్తేనే కండ్లు బైర్లు కమ్ముతున్నాయి. జిల్లాల్లో ప్రజావాణికి వెళ్లి పింఛనుకు దరఖాస్తు పెట్టుకుంటే, సవాలక్ష కాగితాలు అడిగే మన పరిపాలన వ్యవస్థ, ప్రాజెక్టుల్లో అవినీతి గోదారై పారుతుంటే కండ్లులేని కబోదిలా వ్యవహరించింది. చెవులుండి వినలేని దుస్థితిని సృష్టించుకుంది. కాయకష్టం చేసి, పైసా పైసా కూడేసి సర్కారుకు పన్నులు కడితే, ప్రాజెక్టుల నిర్మాణం పేర అక్రమార్కులు సాగిస్తున్న అవినీతి అంతా ఇంతా కాదు. ఆమ్యామ్యాలకు అలవాటుపడ్డ అక్రమార్కుల ఆటకట్టించేలా సర్కారు కార్యాచరణ ఉండాలి. అవినీతికి పాల్పడిన అధికారులు, ఇంజినీర్ల ఆస్తులను జప్తు చేయడం, కేసులు పెట్టడం, అరెస్ట్‌ చేయడం, ఉద్యోగాల నుంచి తొలగించడం సరే, విధానాల పేర నిర్ణయాలు చేసిన అప్పటి పాలకులనూ బోనులో నిలబెట్టాలి.

రాజకీయ అవినీతిని ఎలాంటి పరిస్థితుల్లోనూ విస్మరించ కూడదు. చట్టం ముందు అందరూ సమానమే. దాని పని అది ఆటంకాలు లేకుండా సజావుగా చేసుకుపోయేలా సహకరించాలి. కానీ, రాజకీయ కక్షలుగా, ప్రయోజనాలుగా మారకూడదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.1.47 లక్షల కోట్లయితే, అందులో రూ.48,665 కోట్ల పనులు ఒకే ఒక్క అధికారి పర్యవేక్షణలో జరగడం గమనార్హం. ప్రణాళిక, డిజైన్‌, స్థలాల ఎంపిక, నిర్మాణ సందర్భాల్లో జరిగిన మార్గదర్శకాల ఉల్లంఘనకు బాధ్యులను గుర్తించాల్సిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆస్తుల జప్తు కోసం కోర్టులో ఏసీబీ కేసు వేసింది. దీనికి అనుమతి ఇస్తూ కోర్టు తీర్పు వెలువడటంతో నీటిపారుదల శాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ కేసు నుంచి బయటపడితేనే ఆస్తుల క్రయవిక్రయాలపై సంబంధీకులకు అధికారం వస్తుంది. అప్పటి వరకు ఆస్తులు సీజ్‌ అయి నిషేధిత జాబితాలోకి వెళ్తాయి. ఇక్కడ కఠినంగా ఉండకపోతే మరెన్నో కేసులకు అవకాశమిచ్చినట్టవుతుంది.
కాళేశ్వరం అవినీతి కేసు సర్కారీ వ్యవస్థకు చెరగని మచ్చే కానుంది.

ఇది పరిపాలనా వైఫల్యం కూడా. అలాగే పారదర్శకత, జవాబుదారీతనానికి తూట్లు పొడిచేది. నాటి సర్కారును ‘టార్గెట్‌’ చేయడానికే నేటి ప్రభుత్వం సీబీఐ విచారణను కోరిందనే రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం భారీ అవినీతి ఏ ఒక్క వ్యక్తో, అధికారో చేసిన తప్పిదం కాదు. అప్పటి ప్రభుత్వంలోని అందరూ బాధ్యత వహించాల్సిందే. అందుకే పీసీ ఘోష్‌ న్యాయ విచారణ కమిషన్‌ ‘అన్నీ సందర్భాల్లో అందరి పాత్రా ఉంది’ తన 665 పేజీల నివేదికలో ఇటు అప్పటి ప్రభుత్వాన్ని, అటు అధికారులు, ఇంజినీర్లనూ తప్పుబడుతూ స్పష్టంగా పేర్కొన్నది. ఇది రాజ్యాంగ వ్యవస్థలకు పెనుసవాల్‌. అందుకే ఏ ఒక్కరిని ఉపేక్షించకూడదు. తెలంగాణ వ్యవసాయ రంగానికి కాళేశ్వరం ‘గేమ్‌ ఛేంజర్‌’ అవుతందని అందరూ ఆశపడ్డారు. కానీ, అది ఎందుకు పనికిరాని ఒక భారీ సిమెంటు కట్టడంగా మిగిలిపోతుందని ఎవరూ ఊహించ లేదు. నీటిపారుదల శాఖే కాకుండా ఇతర శాఖల్లోనూ ఉన్న ఈ అవినీతి అంటురోగాన్ని అంతమొందించాలి. లేకపోతే అది ఊడలమర్రిలా విస్తరిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటూనే ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -