Thursday, October 16, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్అమెరికా వ్యవహారం.. సాగుపై ప్రభావం..!

అమెరికా వ్యవహారం.. సాగుపై ప్రభావం..!

- Advertisement -

జీరో టారిఫ్‌లో వాణిజ్య పంటల సాగు ప్రశ్నార్థకం
దిగుబడులకు ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం
ఆదిలాబాద్‌లో నష్టపోనున్న పత్తి, సోయా, మొక్కజొన్న రైతులు
శాస్త్రీయ పద్ధతిలో ఎంఎస్‌పీ కల్పించాలంటున్న అన్నదాతలు


నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ దేశ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకానికి పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఆ దేశ ఉత్పత్తుల ఎగుమతులకు జీరో టారిఫ్‌ విధించి, మన దేశ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తే 50 శాతం సుంకాన్ని విధిస్తుండటంతో దేశంలో సాగవుతున్న వాణిజ్య పంటలైన పత్తి, సోయా, మొక్కజొన్న పంటలపై తీవ్ర ప్రభావం చూపనుంది. జీరో టారిఫ్‌తో అమెరికాలో పండించిన సోయా, పత్తి, మొక్కజొన్న పంటలు దిగుమతి అయితే, స్థానికంగా ఇక్కడ పంటలు ప్రశ్నార్థకం కానున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా సాగవుతున్న పత్తి, సోయాబీన్‌ పంటలు పండిస్తున్న రైతులు రాబోయే కాలంలో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఇప్పటికే రైతులు పండించిన పంటలకు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల మేరకు మద్దతు ధర కల్పించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తంచేశౄయి. అగ్ర రాజ్యం వ్యవహరిస్తున్న తీరుకు రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

రైతాంగంపై తీవ్ర ప్రభావం
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులు పండిస్తున్న పంటలకు శాస్త్రీయమైన పద్ధతిలో మద్దతు ధర కల్పించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు మేరకు మద్దతు ధరల లభించడం లేదు. దీంతో సోయా, పత్తి, మొక్కజొన్న రైతులు ప్రతి ఏటా పండించిన పంట దిగుబడులను విక్రయించే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి యేటా రైతులు మూడు రకాలుగా నష్టపోతున్నారు. అతివృష్టి, అనావృష్టితో నష్టపోగా, యేటా ఒకే రకం విత్తనం వాడటం, పంట కోత దశలో వర్షాలు పడటంతో నష్టం వాటిల్లుతోంది.

పెట్టుబడులకు తగ్గ ‘మద్దతు’ కరువు
ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లాలో వాణిజ్య పంటలైన పత్తి, సోయా, మొక్కజొన్న పంటలు అత్యధికంగా సాగవుతాయి. ప్రస్తుతం ఈ ఏడు పత్తి 4.30లక్షల ఎకరాల్లో సాగు కాగా, సోయా 68వేల ఎకరాల్లో, మొక్కజొన్న 25వేల ఎకరాల్లో సాగయ్యాయి. ప్రభుత్వం క్వింటాల్‌ పత్తికి గతేడాది రూ.7520 మద్దతు ధర ప్రకటించగా ఈ ఏడాది రూ.590 పెంచి రూ.8110 మద్దతు ధర ప్రకటించింది. సోయాబీన్‌కు గతేడాది రూ.4892 ఉండగా రూ.436 పెంచి క్యింటాల్‌కు రూ.5328 ధర కల్పించింది. అదే విధంగా మొక్కజొన్న రూ.2225 ఉండగా రూ.175 పెంచి రూ.2400 మద్దతు ధర ప్రకటించింది. పెట్టుబడులకు అవుతున్న ఖర్చుతో పోలిస్తే రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న ధర గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోవు కాలంలో రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని రైతు సంఘాల నాయకులు అంటున్నారు

ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రోత్సాహకాలు అందించి, పంట దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులు పండించిన పంటలకు స్వామినాథన్‌ సిఫారసులు పరిగణలోకి తీసుకుని శాస్త్రీయ పద్ధతిలో మద్దతు ధర కల్పించాలి. అంతర్‌ పంటల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం సోయా రైతులకు మద్దతు ధర కల్పించడంలో విఫలమవుతోంది. రైతులు పండిస్తున్న సోయాబీన్‌ విత్తనాలను 10 ఏండ్లుగా ఒకే రకం వినియోగించడంతో దిగుబడులు ఉండటం లేదు. విత్తనాల వినియోగంలో, రాయితీలు ప్రకటించి ప్రభుత్వం ప్రోత్సహించాలి. అమెరికా చేస్తున్న ప్రయత్నాలను కేంద్రం అడ్డుకోవాలి. ఇక్కడ పంటలను కాపాడుతూ రైతులను రక్షించాలి.
బండి దత్తాత్రి, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -